Raghurama : వైసీపీ నుంచి గెలిచి, వైసీపీకే కొరకరాని కొయ్యిలా తయారయ్యారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. ‘మా ముఖ్యమంత్రిగారంటే అపారమైన అభిమానం వుంది. మా పార్టీ అధినేత పట్ల బోల్డంత ప్రేమ వుంది. మా పార్టీని నేను వీడలేదు, వీడబోను. కానీ, మా ప్రభుత్వం సరిగ్గా పని చేయడంలేదు..’ అంటూ అర్థం పర్థం లేని వ్యాఖ్యలు అతి తెలివిగా చేస్తూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోన్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ, ఢిల్లీలో ఒక్క రోజు దీక్ష.. సారీ సారీ ఒక్క పూట దీక్ష చేశారు. అదీ ఉద్యోగుల పీఆర్సీ తదితర వ్యవహారాలకు సంబంధించి.
ఢిల్లీలో దీక్ష చేసిన రఘురామ, ఈ దీక్ష ద్వారా ఏం సాధించినట్టు.? అంటే, ‘నేనేదో సాధించేస్తానని దీక్ష చేయడంలేదు.. ఏదో నా వంతు ఉద్యోగులకు మద్దతుగా ఈ ప్రయత్నం చేస్తున్నా..’ అంటూ చెప్పుకొచ్చిన రఘురామ, షరామామూలుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద నానా రకాల విమర్శలూ చేసేశారు. వైసీపీ ప్రభుత్వమ్మీదా, వైసీపీ పైనా రఘురామ ఎప్పుడూ చేసే విమర్శలూ ఇప్పుడూ చేసేసి బోర్ కొట్టించేశారు.
ఇక, రఘురామ దీక్ష మీద సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి వైసీపీ శ్రేణుల నుంచి. అయితే, మరీ అంత గట్టిగా రఘురామను పట్టించుకున్నది లేదనుకోండి.. అది వేరే సంగతి. టీడీపీ అనుకూల మీడియా కూడా రఘురామ ఆశించిన కవరేజ్ ఇవ్వకపోవడంతో, ఆయన ఒకింత నొచ్చుకున్నట్టే వున్నారు.
ఇంతకీ, రఘురామ ఎప్పుడు తన ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు.? ఏమో, ఈ విషయమై ఇంకా ఆయన నుంచి స్పష్టత రావాల్సి వుంది. మరోపక్క, రఘురామ మీద అనర్హత వేటు పడి తీరుతుందని వైసీపీ ధీమాగా చెబుతోంది. ‘రఘురామ ముచ్చట తీరే రోజు త్వరలోనే వస్తుంది.. ఆయన అందుకు సిద్ధంగా వుండాలి..’ అంటూ వైసీపీ నేతలు చెబుతున్నారు.