వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకి సుప్రీంకోర్టు ఇటీవల రాజద్రోహం కేసులో బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయినా, ఆయన బెయిల్ మీద ఇంకా విడుదల కాలేదు. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య చికిత్స కొనసాగుతోంది. ఇదిలా వుంటే, బెయిల్ మీద రేపో మాపో ఆయన విడుదలవడం ఖాయం. అయితే, ఆ వెంటనే ఆయన్ని తిరిగి అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు సిద్ధంగా వున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి, ప్రస్తుతం వున్న రాజకీయాల్లో అరెస్టులు సర్వసాధారణం. ఎవరో ఎక్కడో కేసులు పెడతారు.. ఆ కేసులకు అనుగుణంగా ఆయా నేతల్ని అరెస్టులు చేస్తుంటారు. ఈ క్రమంలో ముందస్తు నోటీసుల్లాంటివి మామూలే. దేవినేని ఉమ విషయంలో ఏం జరిగిందో చూశాం. ఆయన తృటిలో అరెస్టు తప్పించుకున్నారు.
బీజీ జనార్ధన్ రెడ్డిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ మీద కూడా కేసులు నమోదయ్యాయి. అమరావతి భూ కుంభకోణం కేసులో చంద్రబాబు కోర్టు నుంచి కాస్త ఊరట పొందారనుకోండి.. అది వేరే సంగతి. రాజకీయ నాయకులు హద్దులు దాటి వ్యవహరిస్తే, ఆటోమేటిక్‌గా అటువైపు నుంచి స్పందన కూడా వుంటుంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోకుండా వుండరు కదా.? సరే, ఆ కేసుల వెనుక రాజకీయ ప్రోద్భలం వుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. అవి తప్పుడు కేసులైతే, న్యాయస్థానాల్లో ప్రభుత్వానికీ, పోలీసు వ్యవస్థకీ మొట్టికాయలు తప్పవు.
ఇక, రఘురామ విషయానికొస్తే, ఆయనపై ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి పోలీసులకి. అధికార పార్టీకి చెందిన నేతలే పలు సందర్భాల్లో రఘురామపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనాన్ని చూశాం. ఆయా కేసుల్లో తనను అరెస్ట్ చేస్తారంటూ రఘురామ స్వయంగా చెప్పుకున్నారు కూడా. రచ్చబండ పేరుతో రోజువారీ కార్యక్రమం కింద ప్రభుత్వంపై బురదజల్లే క్రమంలో హద్దులు దాటిన రఘురామ మీద చర్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే అరెస్టయ్యారు. మరి, మిగతా కేసుల మాటేమిటి.? వాటితోనూ తనకు చిక్కులు తప్పవనే ఆందోళనలో రఘురామ వున్నారట.