నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇష్యూలో హైకోర్టులో కోర్టు ధిక్కార పిటీషన్ పై స్టే ఇవ్వాలన్న, ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో ఎస్ఈసీ విషయంలో సుప్రీంకోర్టు కీలకవ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇదే వ్యవహారం పై తాజాగా నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను నియమించాలన్నారు. అంతే కాకుండా కోర్టు తీర్పు ప్రకారం రమేష్ కుమార్‌ను నియమిస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్ళటానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని, న్యాయస్థానాలను గౌరవిద్దాం, న్యాయవ్యవస్థ విలువను కాపాడదామని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు చేశారు.
ఇక కరోనా నేపధ్యంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం సరైందే అని రాష్ట్ర ప్రజలు గమనించారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. దీంతో నిమ్మగడ్డను తిరిగి ఆయన పదవిలో కూర్చోబెట్టి సీయం జగన్ తన హుందాతనాన్ని కాపాడుకోవాలని సలహా ఇచ్చారు. ఇక మరోవైపు తనపై అనర్హత వేటు వేయించాలన్న అత్యుత్సాహంతో, ప్రభుత్వ ఖర్చులతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసుకుని మరీ, ఎంపీలను ఢిల్లీకి పంపించడం హాస్యాస్పదమన్నారు. పార్టీలో కొందరి మాటలు విని సీయం జగన్ ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దన్నారు. మరి ఎంపీ రఘురామ్ వ్యాఖ్యల పై వైసీపీ నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.