వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తాను తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే, అందుకు ఓ కండిషన్ విధించారు.ఏపీకి ప్రత్యేక హోదా కోసం తోటి వైసీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధమైతే తాను కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు.
ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయాలంటూ వైసీపీ విప్ జారీ చేస్తే అందరితో పాటు తాను కూడా కట్టుబడి ఉంటానని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు.కేంద్రం అధికారంలో ఉన్న ఎన్డీయేలో వైసీపీ చేరుతోందంటూ ఆ పార్టీనే కొన్ని పేపర్లు, టీవీల్లో రాయిస్తోందని రఘురామకృష్ణంరాజు అనుమానం వ్యక్తం చేశారు.
బీజేపీకి, వైసీపీకి స్నేహం సాధ్యపడదని స్పష్టం చేశారు. అసలు బీజేపీకి, వైసీపీకి ఎలా సెట్ అవుతుందని ప్రశ్నించారు. వైసీపీని ఎన్డీయేలో చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.
మరోవైపు అమరావతిలో రైతులకు న్యాయం జరగబోతోందని రఘురామకృష్ణంరాజు చెప్పారు. రైతులు, మహిళలు గాంధేయమార్గంలో ఆందోళన కొనసాగించాలని ఆయన సూచించారు. అమరావతి రైతులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన రోజే రఘురామకృష్ణం రాజు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.