రఘురామ జోస్యం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కి లాభమే సుమీ.!

Raghurama Josyam

Raghurama Josyam

వైసీపీ ఎమ్మెల్యేలలో కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారట. అలాగని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా సెలవిచ్చారు. గత కొద్ది రోజులుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై లేఖాస్త్రాలు సంధిస్తూ వస్తున్న రఘురామ నుంచి వచ్చిన తాజా లేఖ సారాంశం, వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో వున్నారని. వాలంటీర్ల వ్యవస్థ కారణంగా, గ్రామ పంచాయితీ వ్యవస్థ దెబ్బ తింటోందన్నది రఘురామ ఆరోపణ.

వాలంటీర్లు, పంచాయితీ కార్యదర్శుల కారణంగా సర్పంచుల వ్యవస్థకు అధికారాలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేసేస్తూ ఓ లేఖ తాజాగా రాశారు రఘురామ. సర్పంచుల వ్యవస్థ అయోమయంలో పడటం, అధికార పార్టీ ఎమ్మెల్యేలకూ నచ్చడంలేదన్నది రఘురామ ఉవాచ.

సరే, అందులో నిజమే వుందని అనుకుందాం. 150 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరైనా బాహాటంగా ఆ విషయాన్ని చెప్పలేకుండా వుంటారా.? పోనీ, ముఖ్యమంత్రి అంటే భయం లేదా భక్తి లేదా గౌరవం.. వీటిల్లో ఏదో ఒకటి వుండడం వల్ల.. లేదంటే మూడూ వుండడం వల్ల ఆ ఎమ్మెల్యేలు మిన్నకుండిపోతున్నారనే అనుకుందాం.

కానీ, ఇలాంటివి చిన్న విషయాలు కాదు.. దాచేస్తే దాగిపోవడానికి. స్థానిక ఎన్నికల్లో అన్ని విషయాలూ బయటకొచ్చేసేవే. ఏదో ఒక రకంగా అధికార వైసీపీలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నమైతే రఘురామ గట్టిగానే చేస్తున్నారు. అయితే, రఘురామ లేఖలతో అధికార పార్టీకి కొంత మేలు జరిగే అవకాశం వుంది. అసంతృప్తి ఎక్కడన్నా వుందని అధికార పార్టీ పెద్దలు గుర్తించగలిగితే, వెంటనే దాన్ని సరిదిద్దడానికి వీలవుతుంది.

అదే సమయంలో, రఘురామ కారణంగా తలెత్తే అసంతృప్తి ఛాయలు వున్నా.. వాటిని ముందే గుర్తించి.. ‘వేటు’ వేయడానికీ అధికార పార్టీకి అవకాశం దొరుకుతుంది. కాగా, అధికార పార్టీని ఎలాగైనా దెబ్బకొట్టాలనే కుట్రపూరిత ఆలోచనతో రఘురామని ముందు పెట్టి విపక్షాలు అడ్డగోలు రాజకీయం చేస్తున్నాయనే వాదన అధికార పార్టీ నుంచి వినిపిస్తోంది.