చెడులోనూ మంచిని వెతుక్కోవాల్సి వుంటుంది.. మంచిలోనూ చెడుని చూడాల్సి వస్తుంది. రాజకీయాల్లో అంతే మరి. అనుక్షణం అప్రమత్తంగా వుండాల్సిందే. చుట్టూ భజనపరుల్ని పెట్టుకుంటే, కింది స్థాయిలో పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత, అధికారంలో వున్నవారికి కనిపించదు.
చంద్రబాబు హయాంలో జరిగిందదే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలోనూ జరుగుతున్నది అదే. నో డౌట్, సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆంధ్రపదేశ్ రాష్ట్రం, దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. కానీ, ఎలా.? అప్పులు చేయడం ద్వారా. అప్పు చేసి పప్పుకూడు ప్రస్తుతానికి బాగానే వుంటుది. భవిష్యత్తు మాత్రం భయానకంగా తయారవుతుంది.
ఇలాంటి సందర్భాల్లోనే ప్రభుత్వంలో వున్నవారు సద్విమర్శల్ని స్వీకరించగలగాలి. లోపాల్ని సరిదిద్దుకోవాలి. తప్పో ఒప్పో.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత పార్టీకి దూరంగా వున్నారు. కానీ, ఆయన బయట నుంచి ఇస్తోన్న కొన్ని సలహాలు అధికార వైసీపీ పాటిస్తే.. అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి చాలా చాలా మంచి జరుగుతుంది.
కానీ, రఘురామ సూచనల్ని పాటించే పరిస్థితుల్లో ప్రభుత్వ పెద్దలు లేరు. మిగతా విషయాల్ని పక్కన పెడితే, అన్న క్యాంటీన్ల విషయంలో వైఎస్ జగన్ సర్కార్ అనుసరిస్తున్న వైఖరి అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. కరోనా నేపథ్యంలో అన్న క్యాంటీన్లు.. ఎంతోమందికి ఉపయోగపడేవి. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. జగనన్న క్యాంటీన్లని పేరు పెడతారో.. రాజన్న క్యాంటీన్లని పేరు మార్చుతారోగానీ.. ఆ క్యాంటీన్లను తెరవాల్సి వుంది. తద్వారా పేదలకు తక్కువ ధరకే కడుపు నిండే పరిస్థితి వస్తుంది. అది ప్రభుత్వానికి చాలా మంచి పేరు తెస్తుందికూడా.
వీలైతే, ప్రభుత్వం ఏదో ఒక సంక్షేమ పథకం తరహాలో ఉచిత భోజనం అందిస్తే.. ఇంకా మంచిది. ఈ విషయమై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రఘురామ రాసిన తాజా లేఖ, వైసీపీ అభిమానుల్నీ ఆలోచనలో పడేస్తోంది.