ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రావడం ముఖ్యమా.? రఘురామకృష్ణరాజు మీద అనర్హత వేటు పడటమా.? వైసీపీ అధిష్టానం దృష్టిలో రఘురామ మీద అనర్హత వేటు పడటమే అత్యంత ప్రాధాన్యతాంశంగా మారిపోయిందనే చర్చ సర్వత్రా జరుగుతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేక హోదా సహా చాలా అంశాలపై వైసీపీ ఎంపీలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యేక హోదా విషయమై రాష్ట్రాన్ని కేంద్రం మోసం చేసిందన్న విషయాన్ని గట్టిగా చెప్పాల్సిన తరుణంలో, కొంత అచేతనత్వం ఆ పార్టీ ఎంపీల్లో కనిపిస్తోందన్న విమర్శ వుంది. ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అయితే, రాష్ట్ర ప్రయోజనాలతో తనకు అస్సలు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తోందనుకోండి.. అది వేరే సంగతి. ప్రత్యేక హోదా సహా విభజన అంశాలు, అలాగే దిశ చట్టం.. వంటి విషయాలపై కేంద్రాన్ని పార్లమెంటు సాక్షిగా వైసీపీ ఎంపీలు నినదిస్తుండడం చూస్తూనే వున్నాం.
కానీ, వాటన్నిటికన్నా ఎక్కువ హైలైట్ అవుతున్నది మాత్రం రఘురామపై అనర్హత వ్యవహారం. తాజాగా రఘురామ దేశం విడిచి పోయే ప్రమాదం వుదంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అనుమానం వ్యక్తం చేయడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. రఘురామ నిజంగానే దేశం విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వుందా.? పైగా, తమ పార్టీకి చెందిన రెబల్ ఎంపీ మీద వైసీపీ ఇలాంటి ఆరోపణలు చేయడం.. అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీకే చెడ్డపేరు తెస్తుంది. ఎందుకంటే, 2019 ఎన్నికల్లో పిలిచి మరీ రఘురామకు వైసీపీనే టిక్కెట్ ఇచ్చింది. రఘురామపై అనర్హత అన్నది వేరే చర్చ. ఆ డిమాండ్ చేసే హక్కు వైసీపీకి వుంది. డిమాండ్ చేయాలి కూడా. అయితే, రాష్ట్రంలో పార్టీ ఫిరాయించినవారి విషయంలో వైసీపీ ఏం చేస్తోంది.? అన్నది కూడా చర్చకు వస్తుంది. ఏదిఏమైనా, రఘురామ వ్యవహారాన్ని హైలైట్ చేయడం ద్వారా తెలియకుండానే స్పెషల్ స్టేటస్ అంశానికి వైసీపీ అప్రాధాన్యత ఇస్తున్నట్లవుతోందని, అది వైసీపీకి రాజకీయంగా చేటు చేస్తుందని రాజకీయ విశ్లేషఖులు అభిప్రాయపడుతున్నారు.