అరరె, రఘురామకృష్ణరాజు భయపడుతున్నారే.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొన్నాళ్ళ క్రితం కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనీ, తనపై వేధింపులకు పాల్పడుతున్నారనీ, తనపై రాజకీయ కుట్రలకు తెరలేపారనీ రఘురామ, సొంత పార్టీ అధినేత.. అలాగే సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత మీద ఆరోపణలు చేస్తూ కోర్టుకెక్కారు. అయితే, బెయిల్ రద్దు వ్యవహారంపై సీబీఐ చిత్ర విచిత్రంగా స్పందించింది. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలంటూ చేతులెత్తేసింది. ఈ వ్యవహారంపై కోర్టు కూడా అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా వుంటే, రాజకీయ కోణంలోనే బెయిల్ రద్దు కోసం రఘురామ పిటిషన్ దాఖలు చేశారంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి వేర్వేరుగా తమ వాదనలు వినిపించారు. ఇక, ఈ వ్యవహారంపై తీర్పు వెలువడాల్సి వుండగా, రఘురామ పిటిషన్ల కొట్టివేత.. అంటూ కొద్ది రోజుల క్రితం ఓ వార్త వెలుగులోకి వచ్చింది వైసీపీ అనుకూల మీడియా ద్వారా. ఆ వ్యవహారంపై కోర్టు ధిక్కరణ.. అంశం ప్రస్తుతం విచారణ దశలో వుంది. బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత.. అంటూ దుష్ప్రచారం చేశారని ఆరోపిస్తూ రఘురామ, ఏకంగా సీబీఐ కోర్టు.. ఈ బెయిల్ రద్దుపై తీర్పు ఇవ్వకుండా చూడాలంటూ హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. అంటే, సీబీఐ కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోందో రఘురామకి ఓ అవగాహన వచ్చేసిందని అనుకోవాలేమో. తన పిటిషన్లు కొట్టవేయబడ్తాయేమోనన్న ఆందోళనతో, సీబీఐ కోర్టు తీర్పుని ఆపాలనే ఆలోచన రఘురామ చేస్తున్నారన్న ప్రచారం నిజమేనా.? అసలు ఈ వ్యవహారంపై హైకోర్టు ఎలా స్పందిస్తుంది.? వేచి చూడాల్సిందే.