వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎట్టకేలకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన రఘురామ, సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన విషయం విదితమే. 10 రోజుల్లోగా బెయిల్ షరతులకు సంబంధించిన ష్యూరిటీలు కోర్టులో సమర్పించాలని న్యాయస్థానం గడువు విధించింది. కాగా, ఇంకా తన ఆరోగ్యం కుదుట పడలేదంటున్న రఘురామ, సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక నేరుగా ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడే ఆయన వైద్య చికిత్స పొందేందుకు అవకాశముంది. కొన్నాళ్ళ క్రితమే రఘురామకు హార్ట్ సర్జరీ జరిగిన విషయం విదితమే. కాగా, రఘురామ అరెస్టు అనంతరం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఐడీ తనను అరెస్టు చేశాక, తన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగిందన్నది రఘురామ ఆరోపణ.
ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతోంది. రఘురామ శరీరంపై గాయాల్లేవని గుంటూరు ప్రభుత్వాసుపత్రి తేల్చగా, సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఆయన్ను సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. అక్కడాయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, రఘురామ శరీరంపై గాయాలు వున్నట్లు తేల్చారు. అయితే, ఆ గాయాలు ఎలా అయ్యాయన్నదానిపై సస్పెన్స్ వీడలేదు.కాగా, రఘురామకి కొద్ది రోజుల క్రితమే బెయిల్ లభించినా, ఆయన విడుదల ఆలస్యమవడంపైనా భిన్న వాదనలున్నాయి. కాగా, బెయిల్ పొందినా రఘురామ, మీడియాతో మాట్లాడేందుకు వీల్లేకుండా పోయింది సుప్రీంకోర్టు షరతుల కారణంగా. ఇంకోపక్క, వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ, సీబీఐ కోర్టును ఆశ్రయించగా, ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయలేదు ఇటు సీబీఐగానీ, అటు వైఎస్ జగన్ గానీ. ఈ వ్యవహారంపై సీబీఐ కోర్టు తాజాగా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.