ప్రశ్నా పత్రాల లీక్ అంత తేలికైన విషయమా.?

Question Paper Leak : ‘మేం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని కొన్ని అలా జరిగిపోతుంటాయ్..’ అంటూ మహిళలపై అత్యాచారాల విషయంలో హోంమంత్రి తానేటి వనిత ‘తేలిక’ వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో కూడా మంత్రి బొత్స సత్యనారాయణ ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

మహిళలపై అఘాయిత్యాల వ్యవహారం చిన్నదేమీ కాదు. అలాగే, ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారం కూడా. నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలే పదో తరగతి ప్రశ్నా పత్రాల లీక్ వెనుక ప్రధాన కారణమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ఆరోపించడమే కాదు, మాజీ మంత్రి నారాయణ పేరునీ ప్రస్తావించారు.

నిజానికి, ముఖ్యమంత్రి చేయాల్సింది ఆరోపణలు కాదు.. ముఖ్యమంత్రికి అంత గట్టి నమ్మకం వున్నప్పుడు, మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేయించగలిగి వుంటే.. ముఖ్యమంత్రి నిబద్ధత బయటపడేది. పరీక్ష ప్రారంభమయిన తర్వాత ప్రశ్నా పత్రం బయటకు వచ్చిందని మంత్రి బొత్స చెబుతున్నారు. దాన్ని లీక్‌గా పరిగణించలేమన్నది మంత్రి బొత్స ఉవాచ.

కానీ, ప్రశ్నా పత్రం బయటకు వస్తే, సమాధానాలు బయట నుంచి పరీక్షా కేంద్రాల్లోకి వెళ్ళడం పెద్ద కష్టమైన వ్యవహారమేమీ కాదు. ఫలానా సంస్థల వల్లే ప్రశ్నా పత్రాల లీకేజీ జరుగుతోందని ప్రభుత్వానికి తెలిసీ, ఆయా సంస్థల యాజమాన్యాల్ని కట్టడి చేయలేకపోవడమంటే, తెరవెనుక లోపాయకారీ ఒప్పందాలు వున్నాయనే అనుకోవాలేమో.

ఇక్కడే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశ్వసనీయత దెబ్బతింటోంది.