బీజేపీ పరువును మంటలో కలుపుతున్న కాంగ్రెస్.. ఢిల్లీలో ఉద్రిక్తంగా మారిన పరిస్దితులు !

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేపడుతున్నారు.. ఇది వరకే ఆలిండియా రైతు సంఘాల పిలుపు మేరకు శుక్రవారం భారత్ బంద్ చేపట్టిన విషయం తెలిసిందే.. కాగా ఈ బంద్ కు కాంగ్రెస్, ఆప్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ సహా 18 ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ఇక ఈ వ్యవసాయ బిల్లుల ద్వారా రైతులను దోపిడీ చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని వీరు ఆరోపిస్తున్నారు.. ఇప్పటికే దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఈ వ్యవసాయ చట్టాలపై నిరసనలు భగ్గుమంటున్నాయి.. అంతే కాకుండా పంజాబ్, హర్యానాతో పాటు ఢిల్లీలో ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చగా, దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వ‌ద్ద విపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు ఉద‌యం పెద్ద ఎత్తున రైతులు చేపట్టిన నిరసనలో భాగంగా ఆందోళన కారులు రెచ్చిపోయి ఓ ట్రాక్టర్‌కు నిప్పు పెట్టారు. దీంతో ఇక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి మంటల‌ను ఆర్పి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు..

ఇక కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఆయా రాష్ట్రాల్లో నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. క‌ర్ణాట‌క‌ రాష్ట్రంలో బంద్ కొన‌సాగుతుండగా, హైదరాబాద్‌లో నిరసనకు దిగిన పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా ఢిల్లీలో ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన వారిని గుర్తించామని, వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు రాజధాని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో సుమారుగా 15 నుండి 20 మంది వ్యక్తులు పాల్గొని, ట్రాక్టర్‌ను తగలబెట్టడంతో పాటు కాంగ్రెస్‌ కు అనుకూల నినాదాలు చేశారట.. కాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీ ఘటనపై‌ స్పందిస్తూ కాంగ్రెస్ అసలు రంగు బయటపడిందని, రైతుల పేరుతో కొన్ని అసాంఘిక శక్తులు అరాచకాన్ని సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు..

ఇకపోతే ఈ మూడు చట్టాలు రైతుకు మేలు చేసేలా కనిపించినా ఏమాత్రం ప్రయోజనకరం కావని.. వర్తకులు, బహుళ జాతి కంపెనీల గుప్పిట్లో రైతులు చిక్కుకునేలా చేస్తాయని విపక్షలు, రైతుల ప్రయోజనాల కోసం పోరాడే సంస్థలు వాదిస్తున్నాయి. సన్నకారు రైతులను కష్టాల్లోకి నెడతాయని, ఈ చట్టాల వల్ల రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయని కూడా అంటున్నారు.. మరి కేంద్రం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి..