తెలంగాణ పట్టభద్రుల ఎన్నికల రాజకీయం మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్ నగర్ లాంటి కీలకమైన స్థానంపై పట్టు కోసం అనేక పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అదే సమయంలో ఇండిపెండెట్ లు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ స్థానం నుండి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీలో దిగనున్నాడు. ఇప్పటికే ఈ స్థానం నుండి 2007 మరియు 2009 లో పోటీచేసి విజయం సాధించి 2014 వరకు మండలిలో ప్రాతినిథ్యం వహించాడు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాల కోసం గట్టిగా పోరాటం చేసిన వ్యక్తిగా ఆయనకు మంచి పేరు వుంది. అలాంటి వ్యక్తి మరోసారి బరిలో దిగటంతో అందరిలో ఆసక్తి నెలకొని వుంది. అయితే మిగతా రాజకీయ పార్టీలకు ఈ పరిణామం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా తెరాసకు గట్టి సవాళ్లు ఎదురుకానున్నాయి. ఎలాగైనా ఈ స్థానంలో విజయం కోసం తపిస్తున్న తెరాస పోటీలో భాగంగా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ను బరిలో దించాలని నిర్ణహించింది. మరో పక్క కాంగ్రెస్ లో కూడా ఈ స్థానం నుండి పోటీచేయడానికి అనేక మంది నేతలు పోటీపడుతున్నారు. ఇక బీజేపీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్ర రావు మరోసారి బరిలో నిలిచి తమ పట్టును నిరూపించుకోవాలని చూస్తున్నాడు. ఇలాంటి వాళ్లందరికీ ప్రొఫెసర్ నాగేశ్వర్ పోటీలో నిలబడటంతో గడ్డు పరిస్థితులు ఎదురుకావచ్చు.
తెలంగాణ గొంతుకను మండలిలో వినిపించే విషయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎప్పుడు ముందే ఉంటాడు, సమకాలీన రాజకీయ విషయాలపై సున్నితమైన విశ్లేషణ చేయగల పట్టు, సమస్యలపై పోరాడగల తెగింపు ఆయనకు ఎక్కువ అనే విషయం చాలా మందికి తెలుసు, తెరాస, కాంగ్రెస్, బీజేపీ మినహా మిగిలిన రాజకీయ పక్షాలు, వివిధ సంఘాలు, మేధావి వర్గాలు మొదలైనవి ప్రొఫెసర్ నాగేశ్వర్ కు తమ మద్దతు తెలిపాయి. అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగ కల్పన విషయంలో సరిగ్గా పనిచేయలేదనే అభిప్రాయం వినిపిస్తుంది. దీనితో పట్టభద్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరో అవకాశం లేకపోలేదు. ఇవన్నీ ఆయనకు కలిసి వచ్చే అవకాశం వుంది. దీనితో ఉరిమే ఉత్సహంతో నాగేశ్వర్ ఎన్నికల ప్రచారం చేయటానికి సిద్ధం అవుతున్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ను తట్టుకొని ఎన్నికల్లో గెలవటం మిగిలిన రాజకీయ పార్టీలకు అంత సులభం కాదనే మాటలు వినిపిస్తున్నాయి.