ఆ రెండు సినిమాలు బావున్నాయి… కానీ తెలంగాణాలో టిక్కెట్ల రేట్లు తగ్గాలి: నట్టికుమార్ 

తెలుగు సినీ పరిశ్రమకు పూర్వ వైభవం రావాలంటే థియేటర్ల టిక్కెట్ల రేట్లు తగ్గాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రముఖ నిర్మాత, ఫిలిం డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టికుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.  ‘శుక్రవారం విడుదలైన రెండు సినిమాలు ‘బింబిసార, సీతారామం’ సూపర్ హిట్  టాక్ తెచ్చుకుని సినీ పరిశ్రమలో ఎనలేని ఉత్సహాన్ని నింపాయి.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటే తెలంగాణాలో థియేటర్ల టిక్కెట్ల రేట్లు చాలా అధికంగా ఉన్నాయి. దీంతో ఈ రెండు సినిమాలకు ఆంధప్రదేశ్ లో కలెక్షన్లు చాలా బావుండగా, తెలంగాణాలో మాత్రం ఎంత మంచి టాక్ ఉన్నప్పటికీ థియేటర్లకు జనాలు రావడం లేదు. ఎంత సూపర్ హిట్ టాక్ వచ్చిన  సినిమాకు కూడా టిక్కెట్ల రేట్లు అధికంగా ఉన్న కారణంగా తెలంగాణలోని థియేటర్లకు జనాలు రావడం తగ్గిపోయింది.. అందుకే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న రేట్లకు కాస్త తగ్గించి, తెలంగాణా థియేటర్లలో రేట్లు కూడా అక్కడి రేట్లకు  సమానంగా ఒకేవిధంగా ఉండేలా ప్రస్తుతం ఏర్పడిన తెలుగు ఫిలిం ఛాంబర్ కమిటీ కృషి చేయాలి.

దీనిని వెంటనే రెండు ప్రభత్వం దృష్టికి తీసుకుని పోయి, సినీ పరిశ్రమకు పూర్వ వైభవాన్ని సంతరించి పెట్టాలని కోరుతున్నాను. ఇక త్వరలో విడుదల కానున్న మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ-2  సినిమాలు కూడా పై సినిమాల లాగా సూపర్ హిట్ అవుతాయని విశ్వసిస్తున్నాను. ఈ ఉత్సహం సినీ ,పరిశ్రమలో నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.