‎Mythri Naveen: సినీ కార్మికులకు ఊహించని షాక్ ఇచ్చిన మైత్రీ నిర్మాత.. వేతనాలను పెంచలేమంటూ!

‎‎Mythri Naveen: గత కొద్ది రోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనధికార సమ్మె నడుస్తున్న విషయం తెలిసిందే. వేతనాలను 30% పెంచాలి అని సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మొన్నటి వరకు ఈ విషయం పట్ల డిమాండ్ చేసిన సినీ కార్మికులు తాజాగా షూటింగ్స్ కి వెళ్లడం కూడా ఆపేశారు. దానికి తోడు ఫిలిం ఫెడరేషన్ కూడా వేతనాలు 30 శాతం పెంచేదాకా సినీ కార్మికులు ఎవరూ షూటింగ్స్ కి వెళ్లవద్దని చెప్పడంతో షూటింగ్స్ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.

‎దీంతో ఫిలిం ఛాంబర్, నిర్మాతలు ఈ సమస్య పరిష్కారానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నిర్మాతలు మాత్రం ఈ సమ్మెకు, వేతనాల పెంపుకు వ్యతిరేకంగానే ఉన్నారు. అయితే తాజాగా ఈ సమస్య పై టాలీవుడ్ అగ్ర నిర్మాత సంస్థల్లో ఒకటైన మైత్రీ నిర్మాత నవీన్ మాట్లాడారు. తాజాగా జరిగిన సు ఫ్రమ్ సో కన్నడ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా నిర్మాత నవీన్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిలో వేతనాలు పెంచే అవకాశం లేదు. ఇండస్ట్రీలో సినిమాలకు రిటర్న్స్ బాగా తగ్గాయి.

‎ఓటీటీ బిజినెస్ లు కూడా లేవు. ఎలా చేస్తే మాకు షూటింగ్ కాస్ట్ తగ్గుతుందో అదే చేస్తాము. కొత్తవాళ్లను తీసుకోవాలా, యూనియన్స్ తో వెళ్లాలా అనేది కూడా చూస్తాము అని తెలిపారు. దీంతో నిర్మాతలు ఇప్పుడు ఉన్న సినీ పరిశ్రమ గడ్డు కాలాన్ని సృష్టిలో పెట్టుకొని వేతనాలు పెంచే ఆలోచనలో అయితే లేరని తెలుస్తోంది. మరి ఈ విషయం పట్ల సినీ కార్మికులు ఏ విధంగా స్పందిస్తారు. ఈ గొడవ ఎలా సద్దుమణుగుతుంది. ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుని సినీ కార్మికులు కాస్త వెనక్కు తగ్గుతారా లేదా, ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుందో చూడాలి మరి.