Priyanka Becomes Mom : ప్రముఖ నటి ప్రియాంక చోప్రా తల్లయ్యింది. తాము తల్లిదండ్రులమయ్యామన్న విషయాన్ని ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనాస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొద్ది రోజుల క్రితమే ప్రియాంక చోప్రాని ‘మీరు తల్లిదండ్రులయ్యేదెప్పుడు.?’ అని ప్రశ్నిస్తే, ‘అది దైవం చేతుల్లో వుంది..’ అని సమాధానమిచ్చిందామె. ఇది జరిగి ఎన్నో రోజులు కూడా అవలేదు.
కానీ, ఇంతలోనే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ తాము తల్లిదండ్రులమయిన విషయాన్ని ప్రియాంక, నిక్ జోనాస్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం గమనార్హం. అసలు విషయమేంటంటే సరోగసీ మార్గంలో ఓ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు ప్రియాంక, నిక్.
మాతృత్వం ఓ గొప్ప అనుభూతి. ఇందుకోసం ప్రతి స్త్రీ ఎన్నో కలలు కంటుంది. అయితే, ఇప్పుడు ట్రెండ్ మారింది. పురిటి నొప్పులతో పని లేదు.. గర్భాన్ని మోయాల్సిన పని అసలే లేదు. ఎవరి గర్భంలోనో తమ బిడ్డని పెంచేసుకుని, తద్వారా తల్లిదండ్రులయ్యే అవకాశాన్ని పొందుతున్నారు చాలామంది సెలబ్రిటీలు.
కొందరికి రకరకాల సమస్యల కారణంగా గర్భం దాల్చే అవకాశం లేకపోవడంతో, సరోగసీ తెరపైకొచ్చింది. కానీ, దీన్ని దుర్వినియోగం చేస్తూ కొందరు ‘భారం తగ్గించుకుంటున్నారు’ అనే విమర్శలున్నాయి. సరే, ప్రియాంక ఎందుకు ఇలా చేసింది.? అన్నది వేరే చర్చ. ‘మాకు ప్రైవసీ కావాలి..’ అని ప్రియాంక చెబుతోంది గనుక.. ఈ ప్రశ్న కొన్నాళ్ళపాటు చాపకింద నీరులా విస్తరిస్తుందేమో.
కానీ, ముందు ముందు ఆమె ‘సరోగసీనే ఎందుకు.?’ అన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందేనేమో. సన్నీలియోన్ సహా చాలామంది సినీ ప్రముఖులు అద్దె గర్భం ద్వారా మాతృత్వాన్ని పొందిన సంగతి తెలిసిందే.