ప్రైవేటు సైన్యం.! ప్రైవేటు పోలీస్ కూడానా.?

ఏమో, అధికారంలో వున్నోళ్ళు తలచుకుంటే ఏమైనా జరగొచ్చు. తాత్కాలిక ప్రాతిపదికన సైన్యంలో నియమాకాలు ఏంటి.? ఈ ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు కారణమవుతోంది. అదీ నిజమే కదా.? దేశ భద్రత అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సరిహద్దుల్లో పొరుగు దేశాల సైనికులతో పోరాడాలంటే, సైనికులకు నిబద్ధత వుండాలి. వారి గుండెల్లో దేశభక్తి ఉప్పొంగాలి. కానీ, అలాంటి సైన్యంలో ప్రైవేటు నియామకాలు అస్సలు సబబు కాదు.

దురదృష్టమేంటంటే, త్రివిధ దళాల్లో తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలకు రంగం సిద్ధం చేసిన కేంద్రం, ఆ దిశగా అగ్నిపథ్ స్కీమ్ తెచ్చింది. ఈ విషయమై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగుతోంది. సైన్యంతో ఆపేస్తుందా.? లేదంటే, పోలీసు వ్యవస్థలోనూ ఇలాంటి నియామకాలు షురూ అవుతాయా.? రాజకీయ విశ్లేషకుల నుంచి, సామాన్యుల నుంచి దూసుకొస్తున్న ప్రశ్న ఇది.

పెద్ద చిక్కే ఈ అగ్నిపథం.! చిన్న విషయం కాదు. చాలా చాలా సీరియస్ సమస్య. దేశం గతిని మార్చేస్తుందో, ముంచేస్తుందో తెలియదు ఈ అగ్నిపథ్ స్కీమ్. అగ్ని వీరులంటున్నారు.. కానీ, ఈ ప్రైవేటు సైన్యం, తాత్కాలిక సైన్యం వల్ల ముందు ముందు ఎలాంటి విపరీత పోకడలు కనిపిస్తాయో ఏమో.

అసలే, కేంద్రం ఆడినట్టల్లా రాష్ట్రాలు ఆడాల్సిన దుస్థితి. తమ పోలీసుల్లో నియామకాలకు సంబంధించి కూడా తాత్కాలిక ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని రాష్ట్రాలు చెబితే, అప్పుడేమవుతుంది.? ఏమో, ఇదైతే కొంత ఇబ్బందికరమైన సందర్భమే. అసలు ఇలాంటి అనుమానం జనంలో కలగకూడదు. కానీ, అందుకు ఆస్కారమిచ్చిందే కేంద్రం.!