ప్రైవేటు దోపిడీ ఎంత.? ప్రభుత్వ జరీమానా ఎంత.?

Private Medical Mafia Vs Govt Fines

Private Medical Mafia Vs Govt Fines

ప్రైవేటు ఆసుపత్రులపై కొరడా ఝుళిపిస్తున్న ప్రభుత్వం.. అంటూ తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు ఆసుపత్రుల కరోనా దోపిడీ వ్యవహారంపై మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. లక్ష్లలో జరీమానాలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు. కానీ, దోపిడీ మాత్రం కోట్లల్లో జరుగుతోంది. హైద్రాబాద్‌లో కరోనా సోకిన ఓ వ్యక్తికి ప్రైవేటు ఆసుపత్రుల్లో అయిన ఖర్చు లక్షరాలా అర కోటి. ఇంతా చేసినా ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి కరోనా కథలు చాలానే వున్నాయి. 5 లక్షలు ఆపైన వుంటే తప్ప, ఓ మోస్తరు ప్రైవేటు ఆసుపత్రి వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు కరోనా బాధితులకి.

ఇక, అక్కడికి వెళ్ళాక.. జరిగే దోపిడీకి ఆకాశమే హద్దు. కృష్ణా జిల్లా గుడివాడలో ఓ ప్రైవేటు ఆసుపత్రి అయితే, కరోనా బాధితుడికి వైద్య చికిత్స చేసేందుకోసం, ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను ఆస్తిపత్రాలు అడిగిందట. ఆ ఆస్తిపత్రాలు రాయించుకుని, వైద్యం చేయడానికి సిద్ధమయ్యిందట ఆ ఆసుపత్రి. మీడియాలో ఇలాంటి కథనాలు చూశాక, అసలంటూ మానవత్వమనేది ఏమన్నా వుందా.? అన్న ప్రశ్న తలెత్తడం సహజమే. మానవత్వం, మట్టి మశానం.. ఇవేవీ ప్రైవేటు ఆసుపత్రులకు వుండవు. రోగి వస్తే చాలు, దోచెయ్యాలన్న కసి తప్ప. నిన్ననే హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిపై రోగి బంధువులు దాడికి యత్నించారు.

లక్షలు దోచేసి, కరోనా బాధితుడి ప్రాణాల్ని కాపాడలేకపోయారు సరికదా, మృతదేహాన్ని అప్పగించడానికీ డబ్బులు డిమాండ్ చేశారన్నది బాధితుల ఆరోపణ. ఇలాంటి ఘటనలు గడచిన ఏడాది కాలంలో కొన్ని వందలు, వేలు చూశాం. మరి, ఎన్ని ఆసుపత్రులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయట.? కరోనా నేపథ్యంలో బాగుపడ్డ రంగం ఏదన్నా వుందంటే అది ప్రైవేటు కార్పొరేట్ వైద్య రంగమే. మెడికల్ మాఫియా, హెల్త్ మాఫియా.. రెండూ కలిసి పండగ చేసుకున్నాయి.. కాదు కాదు, మనుషుల్ని పీక్కు తినేశాయనడం సబబు. జరీమానాలు వేస్తే సరిపోతుందా.? సరిపోదు. మరేం చెయ్యాలి.? ఇంకెప్పుడూ వైద్యం పేరుతో దోపిడీ చెయ్యకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కానీ, అంత ధైర్యం ఈ ప్రభుత్వాలకెక్కడిది.?