బ్లాక్ ఫంగస్ దోపిడీ: కరోనా మహమ్మారిని మించి.!

Private Medical Mafia
Private Medical Mafia
 
కరోనా వైరస్ అదుపులోకి వస్తోందంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంతలోనే, కొత్త భూతం సామాన్యుడ్ని చిదిమేస్తోంది. అదే బ్లాక్ ఫంగస్. నిజానికి, ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల ధన దాహాన్ని మించిన వైరస్ లేదా ఫంగస్ ఇంకోటి వుండదేమో. కరోనా వైరస్ పేరు చెప్పి దోచుకుంటోన్న ప్రైవేటు ఆసుపత్రులు, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ పేరుతో దోపిడీకి తెరలేపాయి. కరోనా విషయంలో రెమిడిసివిర్ తదితర ఇంజెక్షన్ల కొరత ఎలా వుందో, అంతకు మించిన కొరత ఇప్పుడు బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఇంజెక్షన్లకు వచ్చిపడింది. సోషల్ మీడియా వేదికగా.. కరోనా మెడిసిన్స్ కంటే ఎక్కువగా ఇప్పుడు బ్లాక్ ఫంగస్ మెడిసిన్లకు డిమాండ్ కనిపిస్తోంది.
 
ఈ మేరకు సెలబ్రిటీలను ట్యాగ్ చేస్తూ బాధితులు రిక్వెస్టులు పెడుతున్నారు. సెలబ్రిటీలు తమకు తోచిన మేర బాధితులకు సాయమందించేందుకు ముందుకొస్తున్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం వాడే కొన్ని ఇంజెక్షన్ల ధరలు ఏడు వేల వరకూ ఎమ్మార్పీ ధర వుంటే, అది బ్లాక్ మార్కెట్లలో లక్షల రూపాయల ధర పలుకుతుండడం గమనార్హం. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు ఈ ‘మెడిసిన్స్ బ్లాక్ మార్కెట్’ అనే భూతంపై చర్యలు తీసుకోలేకపోతున్నాయి. అసలు కరోనా వైరస్ పేరు చెప్పి దోచుకుంటున్న ఆసుపత్రులపైనే సరిగ్గా కొరడా ఝుళిపించలేని దుస్థితిలో ప్రభుత్వాలు వుండడం గమనార్హం. ‘ప్రభుత్వాసుపత్రుల్లో చికత్స అందుబాటులో వుంది. కరోనా వైరస్ అయినా.. బ్లాక్ ఫంగస్ అయినా.. ఎవరూ భయపడాల్సిన పనిలేదు..’ అని ప్రభుత్వాలు చెబుతుండడాన్ని అభినందించాల్సిందే. అదే సమయంలో, ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీని అరికట్టకపోతే, సమాజానికి అది చాలా పెద్ద చేటు చేస్తుంది. ఈ కార్పొరేట్ మెడికల్ అండ్ హెల్త్ మాఫియా.. కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్ కంటే భయంకరమైన మహమ్మారిలా తయారవడానికి అసలు కారణమేంటి.? ప్రజల ప్రాణ భయమా.? ప్రభుత్వాల చేతకానితనమా.?