ప్రధాని నరేంద్ర మోడీ వైఫల్యం: దేశానికి అంత నష్టం జరిగిందా.?

Demonetization

ఏవేవో మాటలు చెప్పారు. ఎన్నెన్నో కథలు చెప్పారు. ఇంకేవో ఆశలు పెట్టారు. ఎనిమిదేళ్ళ మోడీ పాలన గురించి ఒక్కసారి ఆలోచిస్తే, పెద్ద నోట్ల రద్దు సహా అనేక వైపరీత్యాలు కనిపిస్తాయి. జమ్మూకాశ్మీర్‌ని ఉద్ధరించేస్తామన్నారు.. అక్కడా పరిస్థితులు మళ్ళీ మొదటికొస్తున్నాయ్. అసలేం జరుగుతోంది దేశంలో.? అన్న చర్చ మేధావి వర్గంలోనే కాదు, సామాన్య ప్రజానీకంలో కూడా జరుగుతోంది.

దేశం కనీ వినీ ఎరుగని రీతిలో అప్పులు చేసేసింది గత ఎనిమిదేళ్ళలో. అంతలా అప్పులు చేసినప్పుడు, ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు కనిపించాలి కదా.? కానీ, అదేమీ లేదాయె. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయ్. వంట గ్యాస్ ధర భారమైపోయింది. పెట్రో మంట మండుతూనే వుంది. పన్నులు, పన్నుల మీద పన్నులు.. ఇంతకీ, ఈ డబ్బు అంతా ఏమైపోతోంది.? దేశంలో ప్రతి ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్నాం.. అని మోడీ సర్కారు చెబుతోంది.

ఎంపిక చేసిన గ్రూపులకు ఉచితంగానే వ్యాక్సినేషన్ చేయించామనీ చెబుతున్నారు మోడీ. అది ఉచితమెలా అవుతుంది.? వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వ ఖజానాపై పడే భారం, దాన్ని నింపుకోడానికి మళ్ళీ పన్నులు.. వెరసి, జనం నెత్తినే కదా బండ పడేది.?

కాంగ్రెస్ హయాంలో వున్న రాయితీలన్నీ మోడీ హయాంలో అటకెక్కిపోతున్నాయ్. ఓ పక్క కనీ వినీ ఎరుగని రీతిలో అప్పులు, ఇంకో వైపు ప్రభుత్వ సంస్థల అమ్మకాలు. ఎటు చూసినా, పాలనా విధ్వంసం తప్ప, పాలనా సంస్కరణలనేవే కనిపించడంలేదన్నది మేధావి వర్గం మాట.

ఒకప్పుడు ఏ మేధావి వర్గమైతే మోడీని ఆకాశానికెత్తేసిందో, ఇప్పుడు వాళ్ళంతా ముక్కున వేలేసుకుంటున్నారు.!