ఏపీలో లా అండ్ ఆర్డర్ మరీ ఇంత వీక్‌గా ఉందా ? ఇదొక కొత్త డ్రామానా ? 

President responds to Dalit man letter
రాష్ట్రంలో ఈమధ్య దళితుల మీద దాడులు పెరిగాయి.  అలాంటిదేం లేదని పాలక వర్గం వాదించినా దాడులు జరుగుతున్నాయన్న మాట ముమ్మాటికీ వాస్తవం.  గత నెలాఖరున  తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడిని ఇసుక అక్రమ రవాణా వాహనాలకు అడ్డుతగిలాడనే కారణంగా పోలీసులే స్టేషన్లో పెట్టి చితగ్గొట్టి శిరోముండనం చేసిన ఉదంతం దళితుల మీదున్న చిన్న చూపును కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.  ఈ వ్యవహారంలో అధికార పార్టీ నేతల ప్రోద్బలంతోనే పోలీసులు ఇంతటి దారుణానికి ఒడిగట్టారనే ఆరోపణలున్నాయి.  స్వయంగా ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్ కలుగజేసుకున్నారు.  దీంతో ఒక ఎస్సై, కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. 
 
కానీ బాధితుడు వరప్రసాద్ మాత్రం తనకు తగిన న్యాయం జరగలేదని అంటున్నారు.  అసలు తనపై ఇంతటి దారుణం జరగడానికి కారణమైన రాజకీయ నేతలపై చర్యలు తీసుకోలేదని వాపోయాడు.  తీవ్ర మనస్థాపానికి గురైన అతడు నేరుగా రాష్ట్రపతి కార్యాలయానికి లేఖ రాశారు.  అందులో తనకు న్యాయం జరగకపోతే మావోయిస్టుల్లో కలిసిపోవడానికి తనకు అనుమతి ఇవ్వాలని లేఖలో విజ్ఙప్తి చేసుకున్నారు.  దీంతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందించారు.  బాధితుడికి న్యాయం జరిగేలా చూడాలని ఒక ప్రత్యేక అధికారిని నియమించినట్లు రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.  
 
ఎపీ జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీ జనార్థన్ బాబుకు బాధితుడి లేఖను రాష్ట్రపతి కార్యాలయం పంపింది.  జనార్ధన్‌బాబును కలిసి, కేసుకు సంబంధించిన వివరాలు, ఆధారాలు అందించి సహకరించాలని బాధితుడు ప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం సమాచారం అందింది.  అయితే నక్సల్స్‌ లో చేరతానని బాధితుడు లేఖ రాయడాన్ని ఏలూరు డీఐజీ తప్పుపట్టారు.  దీనికి చట్టప్రకారం చర్య తీసుకుంటామని, ప్రసాద్‌ వెనకాల ఎవరున్నారో తనకు తెలుసునని, వారిపై కూడా చర్య తీసుకుంటామని అన్నారు.  అసలు రాష్ట్రపతే నేరుగా స్పందించి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని ఆదేశించడం అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పనితనం మీద చురకలు వేయడమే అవుతుంది.  దాని గురించి పట్టించుకోకుండా డీఐజీ బాధితుడు మనస్థాపంతో రాసిన లేఖను తప్పుబట్టడం గమనార్హం.