సినిమా హాళ్లు మూతబడటం మొదలైంది. గతంలో అంటే ప్రభుత్వాలు బలవంతంగా సినిమా హాళ్లను మూసివేయించాయి. లాక్ డౌన్ పేరుతో ఏడెనిమిది నెలలు క్లోజ్ చేశారు. ఆ దెబ్బతో థియేటర్ పరిశ్రమ కుదేలయింది. వేల మంది ఉపాధిని కోల్పోయారు. అలాంటి దారుణమైన పరిస్థితి నుండి ఈమధ్యనే కోలుకుంటున్నారు. సినిమా హాళ్లు ఫుల్ ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. కానీ కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కేసులు 2 లక్షలకు చేరాయి. దీంతో రేపో మాపో ఆంక్షలు ఖాయం అన్నట్టు ఉంది పరిస్థితి. ఆంక్షలు అంటే ముందుగా మూసివేసేది సినిమా హాళ్ళనే.
50 శాతం ఆక్యుపెన్సీ పెట్టినా థియేటర్లు నడవడం గగనమే. అందుకే 50 శాతం అంటే మూసివేయడమే గత్యంతరం అనుకుంటున్నాయి యాజమాన్యాలు. ప్రభుత్వమే మూసివేయమంటే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆ ఆంక్షలు రాకముందే ఆంధ్రాలో సినిమా హాళ్లు మూతబడేలా ప్లాన్ చేశారు. ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించడమే అందుకు నిదర్శనం. పాత ధరలతో జీవో ఇవ్వడంతో ఐదు, పదికి ఏసీ సినిమా హాళ్లు నడపలేక మూసేసుకుంటున్నారు చాలామంది. ఈ రేట్లతో సినిమామను రిలీజ్ చేయడం కంటే ఆపడమే మేలని నిర్మాతలు వాయిదాలు వేసుకుంటున్నారు. దాంతో వచ్చే రెండు నెలలో పెద్ద సినిమాల విడుదలలు ఏమీ లేవు. కాబట్టి సినిమా హాళ్లు నడిపి కూడ ప్రయోజనం ఉండదు. అందుకే యాజమాన్యాలు తాళాలు వేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రాలో 30 వరకు సినిమా హాళ్లు క్లోజ్ అవ్వగా త్వరలో ఇంకొన్ని మూతబడటం ఖాయంగా కనిపిస్తోంది.