ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన ప్రవీణ్ కుమార్.?

ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ దూకుడు పెంచారు. కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్నారు. నిజానికి, ప్రవీణ్ కుమార్.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసేందుకే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారనీ, ఇదంతా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కనుసన్నల్లో నడుస్తున్న డ్రామా అనీ ప్రచారం జరిగింది. అయితే, దళిత అలాగే వెనుకబడిన సామాజిక వర్గాల్ని ఒక్కతాటిపైకి తెచ్చి, తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేసేందుకు ప్రవీణ్ కుమార్ ప్రయత్నిస్తున్నారన్నది తాజాగా వినిపిస్తోన్న వాదన.

రాజకీయ ఆలోచనలతో తాను ఉద్యోగానికి రాజీనామా చేయలేదని ప్రవీణ్ కుమార్ చెప్పుకున్నారుగానీ, రోజుల వ్యవధిలోనే ఆయన వాయిస్ మారింది. నేరుగా తెలంగాణలోని అధికార పార్టీ మీద విమర్శల బాణాల్ని ఎక్కుపెడుతున్నారు ప్రవీణ్ కుమార్. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానంటూ హామీ ఇచ్చి, ప్రజల్ని మోసం చేశారంటూ పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్ మీద ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర సమితి ఉలిక్కిపడింది. ‘తెలంగాణ రాష్ట్రంలో దళితుడే తొలి ముఖ్యమంత్రి..’ అంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీయార్ నినదించిన విషయం విదితమే. కానీ, తెలంగాణ వచ్చాక, కేసీయార్ మాట మార్చారు. ఈ విషయాన్నే ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ ప్రస్తావన చేయకుండానే పేర్కొనడం గమనార్హం. ఇదొక్కటే కాదు, దళిత బంధు పథకంపైనా ప్రవీణ్ కుమార్ విమర్శలు చేయడం గమనార్హం. కాగా, ప్రవీణ్ కుమార్ విషయమై వివిధ రాజకీయ పార్టీలు ఆచి తూచి వ్యవహరిస్తున్నాయి. ఆయన ఏ ఆలోచనలతో ఇదంతా చేస్తున్నారన్నదానిపై ఓ అంచనాకి రాలేకపోతున్నాయి రాజకీయ పార్టీలు. కానీ, ఆయన మాత్రం నేరుగా ముఖ్యమంత్రి స్థానం మీదనే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది.