సీఎం ద‌త్త‌పుత్రిక వివాహానికి ముహూర్తం ఫిక్స్… మంత్రుల‌తో పాటు ఐపీఎస్ అధికారులు కూడా హాజ‌రు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్‌రావు ద‌త్త పుత్రిక ప్ర‌త్యూష త్వ‌ర‌లో పెళ్లి కూతురు కానున్న‌ట్టు కొద్ది రోజులుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ నెల 28న వివాహానికి ముహూర్తం ఖరారు చేశారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పెండ్లి వేడుక కోసం ఏర్పాట్లు సాగుతున్నాయి.శ‌నివారం రోజు ఆమెను పెళ్లి కూతురిగా అలంక‌రించారు. బేగంపేటలోని ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ గెస్ట్‌హౌజ్‌లో ఈ వేడుక జ‌ర‌గ‌గా, కేఆర్‌ఎస్‌ లక్ష్మీదేవి, సునంద, గిరిజ, శారద, హైదరాబాద్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మోతి తది తరులు ప్రత్యూష‌కు సంప్ర‌దాయ దుస్తులు ధ‌రింప‌జేసి ప్ర‌త్యూష‌ను పెళ్లి కూతురు చేశారు.

పెళ్లికూతురిగా సీఎం ద‌త్త‌పుత్రికని చూసి అంద‌రు ఆనందించారు. రంగారెడ్డి జిల్లాలో ఐదేండ్ల కిందట కన్న తండ్రి, సవతి తల్లి హింసకు గురి చేయ‌డంతో సీఎం కేసీఆర్ దంప‌తులు ప్రత్యూషను దత్తత తీసుకొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆమె వసతి, విద్య, ఇతర బాగోగులను మహిళా శిశుసంక్షేమశాఖ అధికారులు చూసుకుంటున్నారు. ఇటీవల నర్సింగ్‌ విద్యను కూడా పూర్తిచేసింది. రాంనగర్‌కు చెందిన చరణ్‌ రెడ్డితో ప్ర‌త్యూష ప్రేమ‌లో ప‌డ‌గా, వారి వివాహం జ‌రిపేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈనెల 28 ఉదయం 10 గంటలకు షాద్‌నగర్‌ సమీపంలోని కేశంపేట పాటిగడ్డ గ్రామం వద్ద మేరీమాత ఆలయంలో చరణ్‌ రెడ్డితో క్రిస్టియన్‌ (రోమన్‌ క్యాథలిక్‌) సంప్రదాయ పద్ధతిలో ప్రత్యూష వివాహం జరగనుంది. ఐఏఎస్‌ అధికారి దివ్య దేవరాజ్‌ పర్యవేక్షణలో జరిగే ఈ వివాహానికి పలువురు మంత్రులతో పాటు ఐఏఎస్‌ అధికారులు హాజరు కానున్నారు. ప్రత్యూష పెండ్లికి రావాలని అధికారులు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఆయ‌న వ‌స్తారా రారా అనేది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్ . అయితే ‘వధువు కు నిమ్స్‌లో ఉద్యోగం ఇస్తాను’ అని సీఎం హామీ ఇచ్చినట్టు శిశుసంక్షేమశాఖ జేడీ (స్కీమ్స్‌) కేఆర్‌ఎస్‌ లక్ష్మి వెల్లడించారు.