2019 ఎన్నికల తరువాత ఎక్కువగా వినిపించిన పేరు ప్రశాంత్ కిషోర్. ఎన్నికల తరువాత చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డిల గురించి ఎంతలా ప్రజలు, మీడియా చర్చించుకున్నారో ప్రశాంత్ కిషోర్ గురించి కూడా అంతే మాట్లాడుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీల నుండి పోటీని తట్టుకొని, వైసీపీ గెలవడానికి ప్రశాంత్ కిషోర్ అనేక పథకాలు రచించారు. అయితే దాదాపు 18 నెలల తరువాత మళ్ళీ ప్రశాంత్ కిషోర్ సీఎం జగన్ రెడ్డిని కలవడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
ప్రశాంత్ ఇచ్చిన సలహా ఏంటి?!
ఈ భేటీలో ప్రశాంత్ కిషోర్ సీఎం జగన్ రెడ్డికి కొన్ని కీలకమైన అంశాల విషయంలో సలహాలు ఇచ్చారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. జగన్ పై ఉన్న కేసులు విచారణ దశలో ఉన్నందున అవి కొలిక్కి వచ్చి.. తాను కేంద్ర ప్రభుత్వానికి టార్గెట్‌గా మారితే ఏం చేయాలనే విషయంపై చర్చించినట్టు సీనియర్లు చెబుతుండడం సంచలనం సృష్టించింది. ఇక, ప్రస్తుతం వార్డు వాలంటీర్ వ్యవస్థ మాదిరిగానే త్వరలోనే `సోషల్ ఫ్రెండ్` పేరుతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి కూడా ప్రశాంత్ కిశోర్ నుంచి సలహాలు తీసుకున్నారని సమాచారం.
బీజేపీపై కోపంతోనేనా!!
ప్రశాంత్ కిషోర్ చాలా రోజుల నుండి బీజేపీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. బీజేపీని ఓడించడానికి ప్రశాంత్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ అక్కడ బిజీగా ఉన్నప్పటికీ బీజేపీ నుండి సీఎం జగన్ రెడ్డికి రానున్న రోజుల్లో వచ్చే ఇబ్బందులను గురించి చెప్పారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.