దేశంలో బొగ్గు కొరత కారణంగా థర్మల్ పవర్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో విద్యుత్ సమస్యలు తలెత్తాయి.. కరెంటు కోతలు షురూ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇందుకు మినహాయింపేమీ కాదు. తెలంగాణలో మాత్రం కరెంటు సమస్యలు లేవు.
ప్రజలంతా కరెంటు కోతలకు సిద్ధంగా వుండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడం, అధికారులే స్వయంగా ఏసీలను బంద్ చేయాలని ప్రజలకు పిలుపునివ్వడం తెలిసిన విషయాలే. ఈ వ్యవహారంపై పెను రాజకీయ దుమారం చెలరేగింది.
ఇంకోపక్క రాష్ట్రంలో విద్యుత్ కోతలు షురూ అయ్యాయంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం గుస్సా అయ్యింది. అధికారికంగా రాష్ట్రంలో ఎక్కడా కరెంటు కోతలు లేవని స్పష్టం చేసింది. జరుగుతున్నదంతా దుష్ప్రచారమేనని అధికార యంత్రాంగం మండిపడుతోంది.
ఇంతకీ, ఏది నిజం.? ప్రభుత్వ సలహాదారు స్వయంగా విద్యుత్ కొరత గురించి చెబుతూ, కరెంటు కోతలకు ప్రజలు సిద్ధంగా వుండాలని పిలుపునిచ్చారు. సాయంత్రం వేళల్లో ఏసీలు బంద్ చేసి, విద్యుత్ ఆదా చేయాలని అధికారులూ ప్రకటించారు. మరి, ఈ ప్రకటన ఏంటి.? విద్యుత్తుని కొనుగోలు చేసేందుకు నిధుల కొరత లేదని ముఖ్యమంత్రి అంటున్నారు.. అసలు విద్యుత్ కోతలే లేవని అధికారికంగా ప్రకటనా వచ్చింది.
కానీ, అనధికారికంగా విద్యుత్ కోతలు రాష్ట్రంలో అమలవుతున్నాయి. మెయిన్‌టెనెన్స్ సహా పలు కారణాలు చూపుతూ పవర్ కట్స్ విధిస్తున్నారు. అబ్బే, అవి పవర్ కట్స్ కావు.. సాధారణంగా తలెత్తే అంతరాయాలేనని అధికారులు చెప్పదలచుకుంటే.. ప్రభుత్వాన్ని ఈ విషయంలో నిందించడానికి ఏముంటుంది.?
విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాయి, నిలదీస్తాయి.. ఒక్కోసారి దుష్ప్రచారమూ చేస్తాయి. రాజకీయంలో అదంతా ఓ భాగం. కానీ, ప్రభుత్వం తరఫున కరెంటు కోతలపై సంకేతాలిచ్చేసి, ఇప్పుడంతా తూచ్ అంటే అది ప్రభుత్వానికే చెడ్డపేరు.