రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతోనే, రాష్ట్రంలో కరెంటు సంక్షోభం ఏర్పడిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. సమస్య చిన్నదే అయినా, బూతద్దంలో చూడటం, చూపించడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం. అందివచ్చిన అవకాశాన్ని విపక్షాలు ఎందుకు సద్వినియోగం చేసుకోకుండా వుంటాయ్.?
సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు ఏసీలు ఆపెయ్యాలంటూ ప్రభుత్వం చెప్పడం అసంబద్ధమైన వ్యవహారం. రాష్ట్రంలో సరిపడా విద్యుత్ అందుబాటులో లేకపోతే, అది ప్రభుత్వ వైఫల్యమే. బొగ్గు కొరత అనీ, డిమాండ్ పెరిగిందనీ కుంటి సాకులు చెబితే ఎలా.? ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే వుంటుంది కదా.?
నిజానికి, ఇలాంటి సమస్యల విషయమై ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమయి వుండాల్సింది. దేశంలో బొగ్గు కొరత.. అనేది కాదనలేని వాస్తవం.. అన్న చర్చ జరుగుతోంది. అది నిజమే అయి వుండొచ్చు. కానీ, ప్రతి విషయానికీ పొరుగు రాష్ట్రం తెలంగాణతో పోలిక వస్తుంటుంది ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంతవరకు.
తెలంగాణలో విజయదశమి నేపథ్యంలో ప్రత్యేక బస్సులకు అదనపు ఛార్జీలు లేవు. తొలుత అదనపు ఛార్జీల ప్రకటన వచ్చినా, ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో బస్సులకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. నిజానికి, రాష్ట్ర ప్రభుత్వంలో ఏపీఎస్‌ఆర్‌టీసీ విలీనమైన దరిమిలా, అక్కడే ధరలు తక్కువ వుండాలి.
ఇటు బస్సు ఛార్జీలు, అటు కరెంటు సమస్య.. ఒకే కాలంలో ప్రభుత్వానికి ఇరకాటం తెచ్చిపడ్డాయి. ఇటీవల ట్రూ అప్ అంటూ విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ సర్కార్, ఇప్పుడీ కరెంటు సంక్షోభం నుంచి ఎలా బయటపడుతుందో ఏమో. ప్రజలకు వాస్తవాలు చెప్పే క్రమంలో ప్రభుత్వాలోనివారు ఒకింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే.. అది రాజకీయంగా వైసీపీకి మేలు చేస్తుంది. అంతే తప్ప, సమస్య నుంచి పారిపోవడానికి కుంటి సాకులు వెతుక్కుంటే అది సమర్థనీయం కాదు.