కరెంటు కోతలపై సజ్జల హెచ్చరిక.. ప్రమాద ఘంటికలే.!

ఈ మధ్యనే వైఎస్ జగన్ ప్రభుత్వం ‘కరెంటు పొదుపు’పై అధికారిక ప్రకటన లాంటి హెచ్చరిక చేసింది. సాయంత్రం కొంత సమయం వరకు ఏసీలు బంద్ చేయాలన్నది ఆ హెచ్చరిక సూచన లాంటి ప్రకటన సారాంశం. వచ్చేది శీతాకాలం గనుక, ఏసీలతో అవసరం పెద్దగా వుండకపోవచ్చు. కానీ, ఏసీల వాడకం తగ్గించాలంటూ ప్రభుత్వం సూచించడమేంటి.?

రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రతరమవుతోంది. బొగ్గు ఉత్పత్తి, సరఫరా తగ్గడంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తికి సమస్యలేర్పడుతున్నాయి. మరోపక్క, ఇతరత్రా సమస్యలూ వున్నాయి. అందులో ఆర్థిక పరమైన సమస్యలు ముఖ్యమైనవి. ఆ కోణంలో చూస్తే, విద్యుత్ వాడకాన్ని ప్రజలు తగ్గించడమే మేలు.

ఇదిలా వుంటే, ‘ట్రూ అప్’ పేరుతో ఛార్జీల పెంపు పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది ప్రజల నుంచి. దాంతో, ఆ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. నిజానికి, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండాయి. నిండుతూనే వున్నాయి. దాంతో, జలవిద్యుత్ ఉత్పత్తి పెరిగింది. అయినా, ఈ కరెంటు సమస్యలెక్కడినుంచి వస్తున్నాయ్.?

ఇప్పుడే కరెంటు సమస్యలంటే భవిష్యత్తు ఎలా.? విద్యుత్ వాడకం తగ్గించుకోకపోతే కష్టమేనంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే, రానున్న రోజుల్లో కరెంటు కోతల భయం ఖచ్చితంగా వుండబోతోందన్నమాట. అది పారిశ్రామిక ప్రగతికి ఇబ్బందికరంగా మారుతుంది.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని సమస్యలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎందుకొస్తున్నాయి.? ఈ విషయమై రాష్ట్ర ప్రజలకు జగన్ సర్కారు సమాధానం చెప్పాల్సి వస్తుంది.