జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మీద మరో సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సినీ పరిశ్రమలోని సమస్యలపై ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందించారు, ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైసీపీ మీద రాజకీయ విమర్శలు కూడా చేశారు. సినీ కార్యక్రమంలో రాజకీయ విమర్శలు ఏంటి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. వైసీపీ మీద విమర్శలకు, మంత్రి పేర్ని నాని నుంచి పవన్ కళ్యాణ్ మీదకు స్ట్రాంగ్ విమర్శలు వచ్చిపడ్డాయి. మధ్యలో పోసాని కృష్ణమురళి ఎందుకు జోక్యం చేసుకున్నట్టు.? వైసీపీతో పోసానికి సన్నిహిత సంబంధాలున్నాయి కాబట్టి, పోసాని మీడియా ముందుకొచ్చారనుకుందాం.
సినీ పరిశ్రమలో ఎవరో ఓ ప్రముఖ వ్యక్తి ఓ పంజాబీ అమ్మాయికి అవకాశాలిస్తానని మోసం చేసి, కడుపొచ్చేలా చేసి.. ఆమెకు 5 కోట్లతో సెటిల్మెంట్ చేసి పంపించేశాడన్న విషయాన్ని పోసాని ప్రస్తావించడమెందుకు.? ఎవరా పంజాబీ యువతి.? అన్నది పోసాని ప్రకటించి వుంటే బావుండేది. పోనీ, ఇన్నేళ్ళలో ఆ యువతికి అండగా నిలబడాలన్న ఆలోచన పోసానికి రాకపోవడమేంటి.? ఆ యువతి పేరు పవన్ కళ్యాణ్ చెవిలో చెబుతారట పోసాని. చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ చెవిలో కాదు, పోలీసుల చెవిలో. ఓ సినీ నటుడిగా పోసాని కృష్ణమురళి, సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి వుంటే బావుండేది. పవన్ కళ్యాణ్ స్థాయిలో కాకపోయినా, పోసాని కృష్ణమురళి కూడా ఆయా సమస్యల్ని ప్రస్తావించి, సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించి వుంటే ఇంకోలా వుండేది. పవన్ కళ్యాణ్ మీద రాజకీయ విమర్శల కోసం వైసీపీలో చాలామందే వున్నారు. మరి, పోసాని ఎందుకింత ఆవేశానికి లోనయినట్టు.? బహుశా ఏదన్నా పదవిని వైసీపీ ప్రభుత్వం నుంచి ఆయన ఆశిస్తున్నారేమో.