రాజకీయ దేవాలయం: ఖర్చు రెండు కోట్లా.? మూడు కోట్లా.?

రాజకీయ నాయకులకు దేవాలయాలు కట్టేయడం కొత్త విషయమేమీ కాదు. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత (తెలంగాణ) శంకర్ రావు, సోనియాగాంధీకి గుడి కట్టించేయడం అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. స్వర్గీయ ఎన్టీయార్ కోసం కూడా దేవాలయాలు నిర్మించే ప్రయత్నాలు జరిగాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డికీ గుడి కట్టేందుకు కొందరు ప్రయత్నించారు. పి.జనార్థన్ రెడ్డి (తెలంగాణ)కి దేవాలయం వుంది. ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరుతో దేవాలయాన్ని నిర్మించేశారు చిత్తూరు జిల్లాకి చెంది వైసీపీ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి. ఈ దేవాలయ నిర్మాణం కోసం 2 కోట్లు ఖర్చు చేశారన్నది ఓ ప్రచారం.. కాదు కాదు, అది మూడు కోట్ల రూపాయలతో నిర్మితమైన దేవాలయమంటూ మరో ప్రచారమూ జరుగుతోంది. ఇంతకీ అసలు ఖర్చెంత..? దానికోసం అన్ని నిధుల్ని ఎలా తీసుకొచ్చారు.?

అన్న ప్రశ్నల చుట్టూ పెద్ద రచ్చే షురూ అయ్యింది. కరోనా పాండమిక్ సమయంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించి, చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాప్తికి కారణమయ్యారనే ఆరోపణలు సదరు వైసీపీ ఎమ్మెల్యే మీద గట్టిగా వచ్చాయి. అయితే, అదే ఎమ్మెల్యే.. కరోనా పాండమిక్ సమయంలో పేదల్ని ఆదుకునేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. వందలాది మంది, వేలాది మంది ఆయన్నుంచి సాయం పొందారనే సానుభూతి.. ఆయన సొంత నియోజకవర్గంలో వుందనుకోండి.. అది వేరే సంగతి. నవరత్నాల పట్ల ప్రజల్లో వున్న గౌరవం, ఆయా పథకాలకు లభిస్తున్న జనాదరణ నేపథ్యంలో ఈ నవరత్న దేవాలయాన్ని ఎమ్మెల్యే మదుసూధన్ రెడ్డి నిర్మించారట. అయితే, రాజకీయం అంటే సేవ.. ఇందులో వ్యక్తి పూజకు తావుండకూడదు. కానీ, ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయ్. వ్యక్తి పూజ చుట్టూనే రాజకీయాలు నడుస్తున్నాయి. కేవలం మంత్రి పదవి కోసమే సదరు ఎమ్మెల్యే ఈ పని చేశాడన్న విమర్శ, సొంత పార్టీలోనే వ్యక్తమవుతుండడం గమనార్హం.