ఆ రాయికి కాళ్ళున్నాయ్.. కాదు, రెక్కలున్నాయ్. ఏవో ఒకటి వుండే వుండాలి. ఎగురుకుంటూ వచ్చిందో, నడుచుకుంటూ వెళ్ళిందో.. టీడీపీ అధినేత చంద్రబాబే లక్ష్యంగా దూసుకెళ్ళందట. ఒక్కటే కాదండోయ్, రెండు మూడు రాళ్ళు అలా దూసుకెళ్ళాయట. దీన్ని హత్యాయత్నంగా టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత వున్న చంద్రబాబు వైపుకి అంత భయం లేకుండా ఎలా ఆ రాళ్ళు దూసుకెళ్ళాయ్.? ఎందుకంటే, అవి పొలిటికల్ రాళ్ళు కాబట్టి. విసిరిందెవరు.? టీడీపీ ఆరోపణల ప్రకారం అవి బులుగు రాళ్ళు.. అదేనండీ వైసీపీకి చెందిన గూండాలు విసిరిన రాళ్ళు.
వైసీపీ వాదన ప్రకారం, అవి పచ్చ రాళ్ళు.. అంటే, టీడీపీనే వ్యూహాత్మకంగా ఆ రాళ్ళ దాడి నాటకానికి వ్యూహం రచించిందని. ‘ఆ రాళ్ళు ఎలా వచ్చాయి.? ఎటు వైపు నుంచి వచ్చాయి.? ఏ రంగు రాళ్ళు.? (రాజకీయ రంగు)’ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఓ మహిళ, ఓ రాయిని తన్నుకుందనీ, తద్వారా గాయం ఏర్పడిందనీ, మరో వ్యక్తికి కూడా అలాగే రాయి తగిలితే, దాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారనీ వైసీపీ ఆరోపిస్తోంది. టీడీపీ మాత్రం, కొందరు కావాలనే రాళ్ళు రువ్వారు.. ఇది వైసీపీ గూండాల పనేనంటూ యాగీ చేస్తోంది. గవర్నర్‌కి ఫిర్యాదు, పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు.. ఇలా నడుస్తోంది వ్యవహారం. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ఈ రాజకీయ రాళ్ళు హాట్ టాపిక్స్ అయ్యాయి. ఈ క్రమంలో ప్రజల సమస్యలు చర్చనీయాంశాలుగా కాకుండా పోతున్నాయి. అధికార పార్టీకి కావాల్సిందిదే. ఆ లెక్కన ఈ వివాదాలతో వైసీపీ హ్యపీనే. కానీ, టీడీపీకి ఏమన్నా రాజకీయ లబ్ది వుంటుందా.? రాజకీయ లబ్ది లేకుండా ఏ విషయాన్నీ రాజకీయ పార్టీలు రాజకీయం చేయవు కదా.? గతంలో వైఎస్ జగన్ మీద జరిగిన దాడి.. ఇప్పుడు ఇది.. రెండిటినీ ఒకే కోణంలో చూడక తప్పదా.?