వైకాపా నేత, సినీ నిర్మాత పీవీపీ కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్. ఆయన ఇంటి పక్కన మొదలైన వివాదం దగ్గర నుంచి పోలీసులపై వదిలిన కుక్కల కేసు వరకూ పీవీపీ పేరు ఇప్పుడు మీడియాలో సంచలనంగా మారింది. ఇంటిపక్కన కైలాష్ అనే వ్యక్తితో గొడవ విషయంలో తప్పు పీవీపీదే అన్నట్లుగా కేసు బలంగా ఉంది. తొలి రోజు విచారణకు హాజరైన పీవీపీ రెండవరోజు
గైర్హాజరయ్యారు. హైకోర్టు నుంచి యాంటీసిపేటరీ బెయిల్ మంజూరు అవ్వడంతో కైలాష్ కేసు విషయంలో అరెస్ట్ కు ఛాన్స్ లేకుండా పోయింది. ఆ తర్వాత ఇంటికెళ్లిన పోలీసులపై కుక్కల్ని ఉసిగొలప్పి వదిలినందుకు గాను మరో కేసు నమోదైంది.
అలాగే తిమ్మారెడ్డిని బంధించి బెదిరింపులకు పాల్పడిన కేసులోనూ అభియోగాలు ఎదుర్కుంటున్నారు. ప్రస్తుతం ఈ రెండు కేసుల విషయంలో పోలీసులు పీవీపీని అరెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు. అయితే అనూహ్యంగా పీవీపీ పరారయ్యారు. పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడలో ఉన్న తన ఆఫీసులు, వ్యాపార సంస్థల్లో గాలించారు. కానీ ఆయన జాడ కానరాలేదు. దీంతో ఈ కేసును మరింత సీరియస్ గా తీసుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేసారు.
పోలీసులు కళ్లు గప్పి తిరుగుతోన్న పీవీపీ సోషల్ మీడియాలో మాత్రం కామెంట్లు పెడుతున్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా..ప్రతీచోటా న్యాయానికి ముప్పు వాటిల్లినట్లే అంటూ మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిన మాటల్నిమళ్లీ పీవీపీ చెబుతున్నాడు. అలాగే ఆర్మీ వారంటే మనందరికీ ప్యాన్ మూవ్ మెంట్..అదే కొంత మంది పోలీసుల్ని చూస్తే తేళ్లు, జర్రిలు పాకుతున్నట్లు ఉంటుందన్నట్లు కొన్ని కామెంట్లు పెట్టారు. దీంతో పోలీసులు ఆ కామెంట్లను మరింత సీరియస్ గా తీసుకున్నారు. ఈ కామెంట్లు ఆయన ఎక్కడ ఉండి పెడుతున్నారని? సమాచారం సేకరిస్తున్నారు. వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకుని కేసుకు సంబంధించిన వివరాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.