పోలవరం: వైసీపీ వర్సెస్ టీడీపీ.. ఎవరు విజేత.?

YSRCP Vs TDP

YSRCP Vs TDP

పోలవరం ప్రాజెక్టు పనులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమయిన విషయం విదితమే. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్టు తయారైంది పోలవరం ప్రాజెక్టు పరిస్థితి. అప్పటికీ, ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

ఇంకో ఏడాదిలో ప్రాజెక్టు పూర్తయిపోతుందన్న వాదన ఈనాటిది కాదు.. ఎప్పటినుంచో వినిపిస్తున్నదే. 2018 చివరి నాటికి పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు.. 2021 నాటికి కూడా పూర్తి కాలేదు. 2022 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. నిజానికి, పోలవరం జాతీయ ప్రాజెక్టు. కేంద్రం ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన మేర ఎప్పటికప్పుడు నిధులు విడుదల చెయ్యాలి.

కానీ, కేంద్రం నుంచి నిధులు సకాలంలో రావడంలేదని గతంలో చంద్రబాబు సర్కార్ ఆరోపించింది.. ఇప్పుడు వైఎస్ జగన్ సర్కారు కూడా ఆరోపిస్తోంది. నిజమే, రాష్ట్ర ప్రభుత్వం తన ఖజానా నుంచి పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ, అంతటి దుస్థితి ఎందుకు.? కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిలదీయలేకపోతోంది.? చంద్రబాబు హయాంలో ఆ ప్రాజెక్టు ఘనత తనదేనని చెప్పుకున్నారు.. వైఎస్ జగన్ కూడా అదే మాట చెప్పుకుంటున్నారు. ఇక్కడే కేంద్రానికీ, రాష్ట్రానికీ మధ్య గ్యాప్ పెరుగుతోంది.

జాతీయ ప్రాజెక్టు మీద రాష్ట్రానికి పెత్తనమేంటన్నది కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ వాదనగా కనిపిస్తోంది. ప్రాజెక్టులు కట్టేది కాంట్రాక్టర్లు.. నిధులు ఇవ్వాల్సింది కేంద్రం. చంద్రబాబు హయాంలో పనులు నత్త నడకన నడిచాయన్నది వైసీపీ ఆరోపణ. వైసీపీ హయాంలో పనులు పూర్తిగా ఆగిపోయాయన్నది టీడీపీ వాదన.

ఈ రెండు వాదనల్ని సమర్థిస్తూ, ప్రాంతీయ పార్టీల పాలనలో రాష్ట్రం నాశనమైపోతోందని బీజేపీ ఆరోపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే విజేతలయ్యేది రాష్ట్ర ప్రజలు. ఇదీ వాస్తవం. ఇక, రాజకీయంగా ఎవరికి లబ్ది చేకూరుతుంది పోలవరం ప్రాజెక్టు ద్వారా.? అంటే, ఇన్నేళ్ళ జాప్యానికి అందర్నీ బాధ్యుల్ని చేయాలి తప్ప, క్రెడిట్ ఎవరికీ ఇవ్వడం అనవసరం అన్న చర్చ అయితే ప్రజల్లో జరుగుతోంది.