పోలవరం రగడ: అసలు ప్రశ్నించాల్సింది ఎవర్ని.

polavaram project
polavaram project
 
పోలవరం ప్రాజెక్టు 2022 నాటికి పూర్తయ్యే అవకాశం వుందన్నది తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాట. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా లభించింది. అప్పటికే, పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి.. కొంతమేర ఖర్చు కూడా జరిగింది. అయితే, కేవలం కాలువలు మాత్రమే తవ్వారంటూ 2014కి ముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై విమర్శలున్నాయి.
 
సరే, అంతకు ముందు ఏం జరిగిందన్నది వేరే చర్చ. 2014 తర్వాత ఏం జరిగిందన్నదే కీలకం ఇక్కడ. జాతీయ ప్రాజెక్టు బాధ్యత కేంద్రం తీసుకుంటే, నిర్మాణంలో కొంత అలసత్వం వుండొచ్చన్న కోణంలో, రాష్ట్ర ప్రభుత్వమే ఆ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను తీసుకోవాలనుకుంది.
 
నిధులు సకాలంలో విడుదల చేస్తామని కేంద్రం చెప్పడంతో, చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాస్త వేగం పెరిగిన మాట వాస్తవం. కానీ, ఏడేళ్ళు సరిపోలేదు ప్రాజెక్టు నిర్మాణం పూర్తవడానికి. ఈ ఆలస్యానికి కారణం చంద్రబాబు పాలనా.? వైఎస్ జగన్ పాలనా.? పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పర్యవేక్షణ కేంద్రం బాధ్యత.
 
ఆ లెక్కన ప్రాజెక్టు ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రమూ బాధ్యత వహించాలి. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగినా, ఆ అవినీతిలో కొంత వాటా కేంద్రమూ భరించక తప్పదు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు హయాలో ఆలస్యమయ్యిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటోంది.
 
వైసీపీ, పోలవరం ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. నిజానికి టీడీపీ అయినా, వైసీపీ అయినా.. ప్రశ్నించాల్సింది కేంద్రాన్ని. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇంకా ఇవ్వలేదని వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతోంది. కానీ, కేంద్రాన్ని నిలదీయలేకపోతోంది. ఎందుకిలా.?