పోలవరం ప్రాజెక్ట్: జగన్ సర్కారుకి మళ్ళీ షాకిచ్చిన మోడీ సర్కార్.!

జాతీయ ప్రాజెక్టు తాలూకు అర్థమేంటో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెలియదా.? తెలిసీ, తెలియనట్టు వ్యవహరిస్తోందా.? 2014 నాటికి సవరించిన అంచనాల ప్రకారమే పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయిస్తామని కేంద్రం చెబుతోందంటే, కేంద్రానికి అసలు పోలవరం ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేనట్టే కనిపిస్తోంది. గతంలో.. అంటే, టీడీపీ – బీజేపీ రాజకీయంగా అంటకాగిన సమయంలో, చంద్రబాబు సర్కార్ చెప్పినదానికి మోడీ సర్కార్ తలూపింది.. మోడీ సర్కార్ చెప్పినదానికి చంద్రబాబు సర్కార్ తలూపక తప్పలేదు. అప్పట్లోనే ప్రాజెక్టు పూర్తవ్వాల్సి వున్నా ఇప్పటిదాకా పూర్తి కాలేదు. ‘రాష్ట్రం మీద నమ్మకం లేకపోతే, కేంద్రమే బాధ్యత తీసుకోవచ్చు..’ అని ఓ సందర్భంలో చంద్రబాబు, ముఖ్యమంత్రి హోదాలోనే విసిగిపోయి వ్యాఖ్యానించారు కూడా.

సుమారు 55 వేల కోట్ల రూపాయలకు అంచనా వ్యయం పెరిగితే, దానికి ‘సరే’ అని గతంలో చెప్పిన కేంద్రం, ఆ తర్వాత మాట దాటేసింది. ఇప్పుడేమో, మళ్ళీ పాత కథే వినిపిస్తోంది. అదే, 2014 ఏప్రిల్ నాటికి సవరించిన అంచనాల ప్రకారం మాత్రమే కేంద్రం నిధులిస్తుందని చెప్పడం. మిగతా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నది కేంద్రం ఉవాచ. మరి, రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి.? ఏమీ లేవు, ప్రాజెక్టుని ఎక్కడున్నది అక్కడ ఆపేయడం తప్ప. ఔను, ముంపు ప్రాంతాల ప్రజల పునరావాసం, నష్టపరిహారం కోసమే భారీగా ఖర్చు చేయాల్సి వుంది. దానికి కేంద్రమే సహకరించాలి, సాయం చేయాలి. ‘అది మా పని కాదు..’ అన్నట్టు కేంద్రం వ్యవహరిస్తోన్న దరిమిలా, ఇది నిజంగానే వైసీపీ సర్కారుకి చాలా పెద్ద షాక్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాలి.. కేంద్రాన్ని నిలదీయాలి. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. కానీ, అలా జరుగుతుందా.? ఆ రాజకీయ ఐక్యత, ఏపీలో కనిపిస్తుందా.? కష్టమే.