పోలవరం ప్రాజెక్టు.. ఆంధ్రపదేశ్ జీవనాడి. దారుణమైన విషయమేంటంటే, ప్రాజెక్టు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి తప్ప, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మాత్రం జరగాల్సిన వేగంతో జరగడంలేదు. ఎప్పుడో బ్రిటిష్ హయాంలో పోలవరం ప్రాజెక్టు ఆలోచన తెరపైకొచ్చింది. ఏడున్నర దశాబ్దాల కాలంలో ఓ ప్రాజెక్టుని మనం పూర్తి చేసుకోలేకపోయామంటే, అంతకన్నా దారుణమైన విషయం ఇంకేముంటుంది.? వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ‘జలయజ్నం’ కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులకు వేగం వచ్చింది. అయితే, కాలువలు తవ్వి, దోపిడీకి పాల్పడ్డారు తప్ప, ప్రాజెక్టు గురించిన ఆలోచన చేయలేదన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి.
ఇక, చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోవడానికి కారణం, పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా దక్కడం వల్లే. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోతే తప్ప, పోలవరం ప్రాజెక్టుకి పట్టిన రాజకీయ గ్రహణం వీడిపోలేదని అప్పట్లో అంతా అనుకున్నారు. కానీ, ‘రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదల్లేదు..’ అన్న చందాన, జాతీయ హోదా వచ్చినా, పోలవరం ప్రాజెక్టు మీద రాజకీయం మాత్రం చల్లారలేదు. దోపిడీ అన్నారు, ఇంకోటన్నారు.. అలా ఆ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతూనే వున్నాయి. అయితే, వైఎస్ జగన్ హయాంలో పనుల వేగం పెరిగిందనే వాదన ఓ వైపు, ప్రాజెక్టు పనుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శ ఇంకో వైపు వినిపిస్తోంది. ఇంతలోనే, ప్రాజెక్టు అంచనా వ్యయం ఇంకోసారి పెరిగింది. గతంలో కేంద్రం ఆమోదించిన సుమారు 55 వేల కోట్ల అంచనా వ్యయానికే దిక్కు లేదు. మళ్ళీ కొత్తగా అంచనా వ్యయం పెరిగితే ఎలా.? కేంద్రం, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధుల విషయంలో కోతలు పెడుతూ వస్తోంది.
దాంతో, ప్రాజెక్టు భవితవ్యం అనుమానాస్పదంగా మారుతోంది ఎప్పటికప్పుడు. ప్రాజెక్టు అంటే గోడలు కట్టేసి, వంతెన నిర్మించేయడం కాదు. కథ చాలానే వుంటుంది. పునరావాసం అత్యంత కీలకం. అది పూర్తవకుండా, ఏ ప్రాజెక్టుని పూర్తి చేయాలనుకున్నా అది సాధ్యమయ్యే వ్యవహారమే కాదు. మరెలా.? పెరుగుతున్న అంచనాలకు బాధ్యత వహించాల్సింది ఎవరు.? అసలు పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదెప్పడు.?