రాజీనామా చేసిన ప్రధాని మోడీ ముఖ్య సలహాదారుడు

ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫీస్‌ (పిఎంఓ) నుండి మరో ఉన్నతస్థాయి అధికారి నిష్క్రమించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రిన్సిపల్ అడ్వైజర్ పీఎం సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన తెలిపారు. సిన్హా క్యాబినెట్ సెక్రటరీగా పదవీ విరమణ చేసిన తరువాత, పిఎంఓలో ‘ప్రిన్సిపల్ అడ్వైజర్’ అనే కొత్త పోస్టును ఆయన కోసం సృష్టించి ఆయన సేవల్ని పొందుతున్న సంగతి తెలిసిందే.

ప్రధాని ముఖ్య సలహాదారు పదవికి పీకే సిన్మా రాజీనామా

పీకే సిన్హా ఉత్తరప్రదేశ్ క్యాడర్ 1977 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్. నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి పదవీకాలంలో అజిత్ సేథ్ నుంచి బాధ్యతలు స్వీకరించిన పీకే సిన్హా.. క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేశారు. అంతకుముందు విద్యుత్, షిప్పింగ్ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఉన్నారు. అతను 2019 లో పదవీ విరమణ చేయడంతో.. అతడిని ప్రధానమంత్రి కార్యాలయంలో (పీఎంఓ) ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ఒక ప్రత్యేక పోస్ట్ సృష్టించి నియమించారు.

నృపేంద్ర మిశ్రా పీఎంఓ నుంచి వైదొలిగిన అనంతరం సిన్హాను ముఖ్య సలహాదారుగా నియమించారు. 2019 సెప్టెంబర్ నెలలో విడుదలైన ఉత్తర్వుల ప్రకారం, అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఏజెన్సీలు, సంస్థలకు సంబంధించిన విధాన సమస్యలు, విషయాలను పీకే సిన్హా పర్యవేక్షించారు. ముఖ్య సలహాదారు పదవి నుంచి సిన్హా వైదొలగడానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారిక వ్యాఖ్య అందలేదు.