2019 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశంలో ఎంత పతనావస్థకు చేరుకుందో అందరికి తెలుసు. దాదాపు టీడీపీలో ఉన్న కీలక నేతలు ఇప్పటికే వైసీపీ, బీజేపీ వైపు చూస్తున్నారు. చాలామంది నేతలు ఇప్పటికే వైసీపీలోకి వెళ్లగా మిగితా నేతలను చంద్రబాబు నాయుడు బతిమిలాడి పార్టీలోనే ఉంచుకుంటున్నారు. నిజంగా టీడీపీతోనే నడవాలనుకుంటున్న నేతలు చాలా నిరుత్సాహంలో ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతల్లో నూతన ఉత్సహాన్ని నింపుతున్నాయి.
జమిలి ఎన్నికలని సంకేతాలు ఇస్తున్న మోడీ
జమిలి ఎన్నికల గురించి బీజేపీ నేతలు చాలా కాలం నుండి కలలు కంటున్నారు. బీజేపీకి అది తీరని కోరికగానే ఉంది. 2018 టైంలో కూడా ఇలాంటి ప్రతిపాదన వస్తే ముందుగా ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వమే దాన్ని వ్యతిరేకించింది. ఒక్కరోజు కూడా తాము అధికారం వదులుకోవడానికి సిద్ధంగా లేవని చెప్పింది. అయితే ఎన్నికల్లో ఓడిపోయినా తరువాత జమిలి ఎన్నికలని చంద్రబాబు నాయుడు చెప్తూనే ఉన్నారు. కానీ ఎవ్వరికి పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. అయితే ఇప్పుడు అఖిల భారత స్పీకర్ల ముగింపు సదస్సులో మోడీ నోటి నుండి కూడా జమిలి ఎన్నికల ప్రస్తావన రావడంతో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మళ్ళీ అధికారం చేపట్టనున్నామని టీడీపీ నేతలు కలలు కంటున్నారు.
టీడీపీ నేతల్లో ఉత్సహం నింపిన మోడీ
అసలే అధికారం లేకపోవడం లేదు, పైగా వైసీపీ నాయకులు చేస్తున్న కక్ష్యపూరిత రాజకీయాలకు భయపడి టీడీపీ నేతలు నిరుత్సాహంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పటి నుండి జమిలి ఎన్నికల గురించి చెప్తున్నప్పటికి టీడీపీ నేతలు నమ్మలేదు కానీ ఇప్పుడు మోడీ నోటి నుండి కూడా అవే మాటలు రావడంతో టీడీపీ నేతల్లో నూతన ఉత్సహం పుట్టిందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మరి జమిలి ఎన్నికలు వస్తే టీడీపీ అధికారం చేపడుతుందో లేదో వేచి చూడాలి.