Y.S.Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై కుట్ర జరుగుతుంది అంటూ పార్టీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పై కూటమి ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతున్నారని ఇటీవల జరిగిన సంఘటనలే అందుకు నిదర్శనం అంటూ ఈయన మాట్లాడారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి సత్య సాయి జిల్లా, రామగిరి మండలంలోని పాపిరెడ్డి పల్లి గ్రామానికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డికి భద్రత కరువైందని తెలుస్తోంది.
జడ్ ప్లస్’ భద్రత కలిగి ఉన్న వ్యక్తి అయిన జగన్‌కు కనీస స్థాయి రక్షణ కూడా ప్రభుత్వం కల్పించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఏకంగా ఒక కుట్రలో భాగమేనని శ్రీకాంత్ రెడ్డి పెర్కొన్నారు. జగన్ పర్యటన గురించి అధికారులకు ముందుగానే సమాచారం అందజేసాము. అయినా ప్రభుత్వం తలపెట్టిన విధంగా చర్యలు తీసుకోలేదని ఈయన ఆరోపణలు చేశారు.
ఇది కేవలం నిర్లక్ష్యం మాత్రమే కాదు.. సంకల్పితమైన కుట్రగా పేర్కొన్నారు. ప్రజల పట్ల ప్రేమతో పర్యటనలు చేస్తున్న జగన్‌కు భద్రతా వైఫల్యాలు ఏర్పడేలా చూడడం ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడికి కూడా సమాన గౌరవం ఇవ్వాలి కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తుందని తెలిపారు.
జగన్ పర్యటనకు 1100 మంది పోలీసులతో భద్రత కల్పించామని హోం మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పుపట్టదగ్గవని శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే అంటూ మాట్లాడుతున్నారు ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే కాదు రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటూ తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలకు శ్రీకాంత్ రెడ్డి సూచనలు చేశారు.