దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి.. గత కొద్ది రోజులుగా నిలకడగా వున్న పెట్రో ధరలు.. ఇప్పడిప్పుడే కాస్త తగ్గడం మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సానుకూలంగా వుండడంతోనే ఈ పరిస్థితి.. అని ఎవరన్నా చెబితే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
దేశంలో అత్యంత చెత్త రాజకీయాలు నడుస్తున్నాయి. ‘వన్ నేషన్ వన్ రేషన్’ అంటున్నారు.. కానీ, పెట్రోలు విషయంలో మాత్రం దేశమంతా ఒకే రేటు.. ఒకే పన్ను.. అని పేర్కొంటూ పెట్రో ధరల్ని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడంలేదు. మామూలుగా అయితే చట్ట సభల్లో ‘మేం అంత అద్భుతంగా పాలన చేయబోతున్నాం.. ప్రజలపై భారం తగ్గించబోతున్నాం..’ అని చెప్పాలి ప్రభుత్వాలు. చిత్రంగా ఈ మధ్య, ‘మేం తగ్గించబోం.. మేం జీఎస్టీ పరిధిలోకి తీసుకురాం..’ అంటూ పెట్రో ధరల విషయమై కేంద్ర ప్రభుత్వం కుండబద్దలుగొట్టేస్తోంది. నిజానికి, ఇది అత్యంత బాధాకరమైన దోపిడీ. దీన్ని అత్యంత తీవ్రంగా ఖండించాల్సిన విపక్షాలు చేష్టలుడిగి చూస్తున్నాయి. ఒకప్పుడు లీటర్ పెట్రోలు ధర రూపాయి.. అదీ ఏ నెల రోజులకో, ఆర్నెళ్లకో పెరిగితే.. విపక్షాలు రోడ్డెక్కి ఆందోళనలు చేసేవి.. ప్రభుత్వాలూ దిగొచ్చేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితే లేదు.
లీటర్ పెట్రోలు ధర సెంచరీకి చేరువైనా.. ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించడంలేదు. అయితే, ఎన్నికలు జరుగుతున్నాయి గనుక.. పెట్రో ధరల్లో కొంత తగ్గుదల కనిపించడం మామూలే. ఈ తగ్గుదల.. ముందు ముందు పెరగబోయే దోపిడీకి నిదర్శనం. గతంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదే జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతోంది. రాష్ట్రాలూ, కేంద్రం.. సమతూకంగా దోచుకోవడం మొదలు పెట్టాక.. పెట్రో ధరలపై ఉద్యమాలు చల్లబడిపోవడం గమనించాల్సిన అంశం.