అయ్య‌న్న పాత్రుడిపై మ‌హిళా ఉద్య‌మం

తేదాపా సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న పాత్రుడు ఇటీవ‌ల న‌ర్సీప‌ట్నం మున్సిప‌ల్ క‌మీష‌న‌ర్ కృష్ణ వేణిని అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై స్థానిక పోలీస్ స్టేష‌న్ లో ఆయ్య‌న్న పాత్రుడిపై ర‌క‌ర‌కాల సెక్ష‌న్ల కింద కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో నిర్భ‌య చ‌ట్టం కింద కూడా కేసు న‌మోదైంది. తాజాగా అయ్య‌న్న పాత్రుడు తీరు పై రాష్ర్ట మ‌హిళ కమీష‌న్ చైర్మ‌న్ వాసిరెడ్డి ప‌ద్మ మండిప‌డ్డారు. స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునేలా అయ్య‌న్న పాత్రుడు వ్యాఖ్యానించార‌ని ధ్వ‌జ‌మెత్తారు. అయ్య‌న్న‌పై కేసు సుమోటాగా తీసుకున్న‌ట్లు తెలిపారు. ఆయ‌న్ని వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని ప‌ద్మ డిమాండ్ చేసారు.

ఈ కేసుకు సంబంధించి ఆ జిల్లా క‌లెక్ట‌ర్ , ఎస్పీ ల‌తో మాట్లాడిన‌ట్లు తెలిపారు. అరెస్ట్ చేయ‌డంలో ఎందుకు జాప్యం జ‌రుగుతుందో అడిగి తెలుసుకున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు విచార‌ణ దాదాపు పూర్త‌యింద‌ని క‌మీష‌న‌ర్ కు అధికారులు వివ‌రించారు. రాష్ర్టంలో మ‌హిళా సంఘాలు, క‌మీష‌న్లు కూడా అయ్య‌న్న తీరుపై మండిప‌డుతున్నాయ‌ని తెలిపారు. సీనియ‌ర్ గా ఎంతో రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌ని చెప్పుకునే ఆయ‌న‌కు ఓ మ‌హిళ‌తో ఎలా మాట్లాడో తెలియ‌దా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఆయ‌న తీరును స‌హించేది లేద‌న్నారు. రాజ‌కీయాల‌ చాటున దాక్కోవాల‌ని చూస్తే బ‌య‌ట‌కులాగుతామ‌ని హెచ్చ‌రించారు.

బాధితురాలికి మ‌హిళా క‌మీష‌న్ పూర్తిగా అండ‌గా ఉంటుంద‌ని, మ‌హిళౄ సంఘాలు కూడా అండంగా ఉన్నాయ‌ని, ఆమెను బెదిరించినా, భ‌య‌పెట్టినా ఉపేక్షించేది లేద‌న్నారు. అయ్య‌న్న పాత్రుడు త‌న అనుచ‌ర‌ల‌తో బెదిరించే ప్ర‌య‌త్నం చేస్తే బాధితురాలు వెంట‌నే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని తెలిపారు. నిర్భ‌య చ‌ట్టానికి సంబంధించి విచార‌ణ కూడా దాదాపు పూర్తయింద‌ని పోలీసు అధికారులు తెలిపారు. ఈ నేప‌థ్యంలో అయ్య‌న్న అరెస్ట్ ఏ క్ష‌ణ‌మైనా జ‌ర‌గొచ్చ‌ని సోష‌ల్ మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తున్నాయి. ఇప్ప‌టికే టీడీపీ సీనియ‌ర్ నేత‌లు కుంభ‌కోణాల‌కు పాల్ప‌డిన నేప‌థ్యంలో అచ్చెన్నాయుడు, జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ల‌ను అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే.