పవన్ కోరిక తీరింది కానీ.. పార్టీ కోరిక మాత్రం తీరలేదు

pawan kalyan

 జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజులు ఢిల్లీ పర్యటన విజయవంతంగా పూర్తిచేసుకున్నాడు, నిజానికి అసలు ఎన్ని రోజులు పర్యటన ఉంటుందో కూడా ఆయనకే సరిగ్గా తెలియదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు బీజేపీ పెద్దల ఆపాయిట్మెంట్ దొరకలేదు. ఢిల్లీ వెళ్లిన మొదటి రోజు అపాయింట్ మెంట్ దొరక్క పోవటంతో అక్కడే పడిగాపులు కాయటం జరిగిందని అనేక మీడియా ఛానల్ లో వార్తలు వచ్చాయి.

pawan kalyan

 అయితే నిన్న ఎట్టకేలకు బీజేపీ అధ్యక్షుడు నడ్డా తో పవన్ కళ్యాణ్ భేటీ కావటం జరిగింది. దీనితో రెండు రోజుల పవన్ కళ్యాణ్ నిరీక్షణకు తెరపడటంతో కాకుండా పవన్ కోరిక కూడా తీరింది, అయితే ఈ భేటీలో పవన్ కళ్యాణ్ అమరావతి, పోలవరం గురించే ఎక్కువగా మాట్లాడినట్లు బయటకు చెప్పిన కానీ, లోపల మాత్రం పవన్ ఎక్కువగా తిరుపతి బై పోల్ గురించే మాట్లాడినట్లు తెలుస్తుంది. తెలంగాణ గ్రేటర్ ఎన్నికల్లో పోటీనుండి తప్పుకొని త్యాగరాజు అనిపించుకున్న జనసేనాని, దానిని ప్రధాన కారణంగా చూపిస్తూ తిరుపతి సీటు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 నిజానికి ఢిల్లీ వెళ్ళింది కూడా అందుకోసమే అంటూ వార్తలు కూడా వెలువడ్డాయి. కానీ తిరుపతి విషయంలో బీజేపీ పార్టీ జనసేనకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తుంది. భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ తిరుప‌తి ఉప ఎన్నిక‌లో అభ్య‌ర్థి ఎవ‌ర‌నే అంశం గురించి ఇరు పార్టీల ఉమ్మ‌డి క‌మిటీ నిర్ణహిస్తుందని, తిరుపతి ఉప ఎన్నికల బరిలో జనసేన అభ్యర్థి ఉంటారా? లేక బీజేపీ అభ్యర్థి ఉంటారా? అన్నది రెండ్రోజుల్లో తేలిపోతుందని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.

 ఉమ్మడి ప్రకటన ఉంటుందన్న విషయాన్నీ ఉమ్మడిగా ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను నమ్మవచ్చు కానీ, కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే ఉమ్మడి ప్రకటన ఉంటుందని చెప్పటం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతుంది. ఇప్పటికే బీజేపీ పార్టీ జనసేనతో సంబంధం లేకుండా తిరుపతిలో ఎన్నికల వ్యూహాలు అమలుచేస్తుంది. ఎక్కడ కూడా జనసేనలో మంతనాలు అనే వాదన పైకి రాకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. దీనిని బట్టి చూస్తే తిరుపతి స్థానంపై బీజేపీ సృష్టమైన వైఖరితోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ గమనిస్తే తిరుపతి టిక్కెట్ జనసేనకు కష్టమే అని చెప్పుకోవాలి. ఇక ఫైనల్ గా ఢిల్లీ టూర్ లో బీజేపీ నేతలను కలవాలన్న పవన్ కళ్యాణ్ కోరిక తీరింది కానీ, పార్టీ కోరిక మాత్రం తీరలేదు.