Pawan With KTR : పవన్, కేటీయార్.. కాబోయే ముఖ్యమంత్రులట.!

Pawan With KTR : ఒక విషయాన్ని రెండు కోణాల్లో ఎలా ప్రత్యేకంగా చూడొచ్చో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? అయితే, ‘ఇద్దరు కాబోయే ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకి రాబోతున్నారు..’ అంటూ సోషల్ మీడియాలో అటు టీఆర్ఎస్, ఇటు జనసేన శ్రేణుల్లో కొందరు ఔత్సాహికులు ప్రచారం చేస్తుండడంతో కొత్త రాజకీయ చర్చ తెరపైకొచ్చింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఒకే వేదికపై కన్పించబోతున్నారు. ఇది నాణేనికి ఓ వైపు. అసలు కోణం వేరే వుంది. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘భీమ్లానాయక్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.

అయితే, ఇటు పవన్ కళ్యాణ్ కావొచ్చు.. అటు కేటీయార్ కావొచ్చు.. ఇలాంటి వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కేటీయార్ అయితే మరీనూ.! ఆ మధ్య ఓ మెగా హీరో సినిమా ఫంక్షన్‌లో కేటీయార్, జనసైనికుల ఉత్సాహం నేపథ్యంలో ఆచి తూచి స్పందించిన విషయం విదితమే. ఈసారి అంతకు మించిన జనసైనికుల ఉత్సాహాన్ని కేటీయార్ చూడబోతున్నారు. సో, ఈసారి ఆయన స్పందన ఎలా వుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది.

అయితే, అభిమానులు అలాగే జనసైనికులకు స్పష్టమైన సంకేతాలు వెళ్ళాయట.. సినిమా ఫంక్షన్ సందర్భంలో ఎలాంటి రాజకీయ నినాదాలూ చేయొద్దని. కానీ, అభిమానులు ఆగుతారా.? ఒకవేళ అభిమానులు ఆగినా, దురభిమానులు అల్లరి చేయకుండా వుంటారా.?