చిరంజీవితో జనసేనాని రాజకీయం.! ఏం జరగబోతోంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన సోదరుడు చిరంజీవిని కలవబోతున్నారట. ఇందులో వింతేముంది.? ఎప్పుడైనా పవన్ కళ్యాణ్, చిరంజీవి కలవొచ్చు.. అన్నదమ్ములు కదా.. కుటుంబ వ్యవహారాలు సహా చాలానే వుంటాయ్.! కానీ, ఇక్కడ జనసేన అధినేత హోదాలో పవన్ కళ్యాణ్, చిరంజీవిని కలవబోతున్నారనీ, రాజకీయాలపై చర్చించబోతున్నారనీ ప్రచారం జరుగుతోంది.

ఎలా కలిసినా చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయ అంశాలు చర్చకు వస్తాయి. జనసేనకు సంబంధించిన విషయాలపై నాగబాబు, చిరంజీవికి వివరించకుండా వుంటారా.? అన్నయ్య చిరంజీవితో పవన్ కళ్యాణ్ రాజకీయాలు చర్చించకూడదన్న రూల్ ఏమైనా వుందా.?

అయితే, ఇది వేరు. 2024 ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చిరంజీవితో ప్రత్యేకంగా చర్చించబోతున్నారన్నది తాజా ఖబర్. ఈసారి అన్నయ్య సలహాలు, సూచనలు తీసుకుని, రాజకీయాల్లో ముందడుగు వేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే అన్నయ్య నుంచి సలహాలు కోరుతున్నట్లు తెలుస్తోంది.

‘రాజకీయంగా ఎవరి దారి వారిది. నేనేమీ సినిమాల పరంగా కూడా ఎవరికీ సలహాలు, సూచనలు ఇవ్వను..’ అంటూ కొన్నాళ్ళ క్రితం చిరంజీవి తన మనసులో మాట బయటపెట్టేశారు. అయినాగానీ, అన్నయ్య చిరంజీవి కోసం ప్రజారాజ్యం పార్టీ యూత్ వింగ్ బాధ్యతల్ని అప్పట్లో పవన్ నిర్వహించిన దరిమిలా, చిరంజీవి బయట నుంచి అయినాసరే, జనసేనకు సలహాలు, సూచనలు ఇవ్వక తప్పదు.

మెగాభిమానులు ఎలాగూ జనసేన పార్టీ కోసం పనిచేస్తామని ఇటీవల తీర్మానించారు. అది కూడా చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కలిసి రాజకీయాల గురించి చర్చించిన అనంతరం మారి ఈక్వేషన్ వల్లనేనని అంటున్నారు.