ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా గెలిచేస్తానన్న ధీమా గతంలో బహుశా పవన్ కళ్యాణ్‌కి వుండి వుండొచ్చు. కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు 2019 ఎన్నికల్లో. సో, ఇప్పుడాయనకు గతంలో వున్న కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా వుండదు.
మామూలుగా అయితే, ఈపాటికే జనసేనాని తాను పోటీ చేయదలచుకున్న నియోజకవర్గాన్ని ఖరారు చేసుకుని వుండాలి. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అప్పటినుంచీ ఆ నియోజకవర్గ ప్రజలతో టచ్‌లోనే వుంటున్నారు. పార్టీ పరంగా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ జనానికి అందుబాటులోనే వుంటున్నారు.
మరి, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నట్లు.? రాష్ట్రమంతా నాదే.. తెలంగాణ కూడా నాదే.. నేను జాతీయ వాదిని.. అన్నట్లున్నారాయన. తిరుపతి నుంచి పోటీ చేస్తారని ఓ సారి, కాదు.. భీమవరం నుంచే ఇంకోసారి అని మరోమారు.. ఇలా రకరకాల ప్రకటనలు జనసేన నేతల నుంచి చూచాయిగా వస్తున్నాయి.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ సహా పలు నియోజకవర్గాలపై జనసేనాని దృష్టిపెట్టారన్నది ఇంకో వాదన. అయితే, ఎటూ తేల్చుకోలేకపోతున్నారు జనసేనాని.. తాను పోటీ చేసే నియోజకవర్గం విషయమై. సార్వత్రిక ఎన్నికల కోసం సమయం దగ్గర పడుతోంది. వీలైనంత త్వరగా నియోజకవర్గాన్ని డిసైడ్ చేసుకోకపోతే కష్టమని పార్టీ ముఖ్య నేతలూ కొందరు పవన్ కళ్యాణ్‌కి సూచిస్తున్నారట.
ఏయే నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేస్తారన్నదానిపై చూచాయిగా లెక్కలేసుకోవాలనీ, ఆయా బాధ్యతల్ని ఆయా నేతలకు అధికారికంగానే అప్పజెప్పేయాలన్న డిమాండ్లూ జనసేనలో బాగానే వినిపిస్తున్నాయి. అయితే, జనసేనాని మాత్రం ఇంకా ‘ధీమా’ ధోరణే కొనసాగిస్తున్నారట. ఈ నాన్చివేత వైఖరి.. పార్టీని మరోమారు ముంచేస్తున్న అభిప్రాయం చాలామందిలో వ్యక్తమవుతోంది.