Pawan Kalyan : ఆ ట్వీట్లన్నీ పవన్ కళ్యాణ్ నుంచే వస్తున్నాయా.?

Pawan Kalyan : సెలబ్రిటీల సోషల్ మీడియా అక్కౌంట్లని వేర్వేరు వ్యక్తులు లేదా సంస్థలు నిర్వహిస్తుంటాయి. మరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా అక్కౌంట్లను ఎవరు హ్యాండిల్ చేస్తున్నట్టు.? ఈ డౌట్ చాలామందికి రావడం సహజమే. పవన్ వేస్తోన్న ట్వీట్లు, జనసైనికులకి కూడా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి, పలు అనుమానాలకు కారణమవుతున్నాయి.

విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన పార్టీ ఓ చిత్ర విచిత్రమైన ఉద్యమాన్ని చేపట్టింది. కేవలం వైసీపీ ఎంపీలే టార్గెట్‌గా ఈ ఉద్యమం నడుస్తోంది. ‘కనీసం ప్లకార్డు అయినా పట్టుకోండి..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ ట్వీటేశారు తాజాగా, వైసీపీ ఎంపీలను ఉద్దేశించి.

దొంగలు పడ్డ ఆర్నెళ్ళకు.. అన్న చందాన, వైసీపీ ఎంపీలు గత కొంతకాలంగా విశాఖ స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు, చట్ట సభల సాక్షిగా కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నారు కూడా. సరే, కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యమాల పట్ల పెద్దగా ‘ఫికర్’ లేదు, అందుకే, ఏపీని.. ఏపీలోని ఉద్యమాల్ని పట్టించుకోవడంలేదనుకోండి.. అది వేరే సంగతి.

‘ఇదిగో మా ఎంపీలు గతంలోనే ప్లకార్డులు పట్టుకున్నారు విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. అందునా, పార్లమెంటులో..’ అంటూ వైసీపీ మద్దతుదారులు పవన్ కళ్యాణ్ మీద సెటైర్లేస్తూ, ట్వీట్లేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడాన్ని తప్పు పట్టలేం. ప్లకార్డులు పట్టుకుంటే చాలు, తాము చెయ్యల్సిన పని పూర్తయిపోయిందని వైసీపీ అనుకుంటే అది పొరపాటే.

కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించాల్సింది కేంద్రాన్ని. ఈ క్రమంలో వైసీపీని కలుపుకుపోయేలా ఆయన రాజకీయ కార్యాచరణ ప్రకటించి వుంటే బావుండేదేమో.