జనసేన పార్టీని స్థాపించి కొత్తతరమైన రాజకీయాలు చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. చెప్పిన విధంగానే మొదట నుండి ప్రజా సమస్యలపై స్పందిస్తూ, ప్రజల పక్షాన నిలబడటానికి అధికారం అవసరం లేదని పవన్ కళ్యాణ్ నిరూపించారు. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ కు కుల, మతాల రంగు అంటుకుంది. దీనికి కారణం బీజేపీతో పొత్తునేనని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
బీజేపీ రాజకీయాలు పవన్ ను దెబ్బతిస్తున్నాయా!!
ఇక తాను అందరి వాడిని అని 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ 2019 నాటికి మాత్రం చాలా రకాలుగా జనంలో నానారు. ఆయన చివరికి పోటీ చేసిన రెండు సీట్లూ కూడా కాపులు ప్రాబల్యం ఉన్నవి కావడంతో కోరి మరీ ఆ కులం రొచ్చులోకి దిగారా అన్న విమర్శలు అయితే వచ్చాయి. పైగా ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆ పార్టీ చేస్తున్న కుల, మత రాజకీయాలు జనసేనకు కూడా అంటుకుంటున్నాయి. గతంలో ప్రజారాజ్యం పార్టీని చిరంజీవిని పెట్టినప్పుడు కూడా ఈ కుల, మత రంగు అంటుకోవడం వల్లే పార్టీ ఓడిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
పవన్ కుల రాజకీయాలను దాటి ఎదగగలడా!!
ఏపీ రాజకీయాలు చూసిన వారికి కుల ప్రభావం ఎంత ఉన్నా కూడా దాన్ని దాటి ఆలోచించేవారి వల్లనే ఘనమైన విజయాలు దక్కాయని చరిత్ర నిరూపించిన సత్యం. ఏపీలో మత రాజకీయాలకు అసలు తావు లేవు. అలాగే ఒక కులానికి చెందిన నాయకులకు గుత్తమొత్తంగా ఓట్లు వేసి గెలిపించిన చరిత్ర కూడా లేదు. కాబట్టి రానున్న రోజుల్లో సీఎం కావాలనుకుంటున్న పవన్ ఇప్పుడు బీజేపీ వల్ల వచ్చిన కుల, మత రంగును దాటుకుని ఎదగగలడో, లేదో వేచి చూడాలి.