ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రజల్లో జోష్ నింపారు. మార్కాపురం-తర్లుపాడు రహదారి పక్కన నరసింహాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ నేతలు మళ్లీ అధికారంలోకి వచ్చి కేసులు పెడతామంటూ బెదిరింపులు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. ‘‘రెండు చోట్ల ఓడినా గుండెల్లో ధైర్యం తగ్గలేదు. మళ్లీ రెచ్చగొడితే ఇంకా గట్టిగానే ఎదురుంటాం’’ అంటూ పవన్ సూటిగా హెచ్చరించారు.
పెదవులు కదిలిస్తే భయపడతామనుకుంటే అది కష్టం అన్నారు. చంపేస్తాం, రపా, రపా అనడమేంటని మండిపడ్డారు. తప్పులు చేస్తే సరిచేయండి.. కానీ మా కక్ష తీర్చుకుంటామంటూ ప్రజలను భయపెట్టకండి’’ అని పవన్ మండిపడ్డారు. గతంలో ఇచ్చిన జల్ జీవన్ మిషన్ నిధులు కేంద్రం ఎందుకు ఆపిందో కూడా పవన్ గుర్తు చేశారు. 26 వేల కోట్లకు 4 వేల కోట్లే వచ్చాయని, వాటి వినియోగం సరిగా లేకే కేంద్రం పథకం ఆపిందని చెప్పారు.
ప్రకాశం జిల్లాలో పారిశ్రామికీకరణ, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని పవన్ స్పష్టం చేశారు. 150 కోట్లు ఎన్నికలకు ఖర్చు చేస్తే, 800 కోట్లు ప్రాజెక్టుకు పెట్టలేం అనే వారు మేము కాదని పేర్కొన్నారు. 18 నెలల్లోనే పూర్తి చేస్తాం. నేనే స్వయంగా పర్యవేక్షిస్తా అని పవన్ హామీ ఇచ్చారు. తమకు ఇంకోళ్ల మీద భయం లేదన్న పవన్.. ఇక కూటమి అంటే పిడికిలి. అన్ని వేళ్లు కలిసే పిడికిలి. ఒక్కరి వల్ల గెలుపు కాదు.. అందరికీ అవసరం ఉంది. ప్రజలకు ఇచ్చిన అధికారానికి న్యాయం చేయడం కూటమిలో ప్రతి ఒక్కరి బాధ్యత అని పవన్ స్పష్టం చేశారు. వ్యక్తిగత విరోధాలు తనకు లేవని, కానీ ప్రజల హక్కులకు తాను రాజీ పడబనని పవన్ తేల్చిచెప్పారు.