అదే దుష్ప్రచారం.? చంద్రబాబు బాటలో పవన్ కళ్యాణ్.!


గంజాయి స్మగ్లింగ్ వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ సర్కార్ రోజురోజుకీ మరింత సంకటంలో పడుతోంది. అదుపు చేయలేని స్థాయికి రాష్ట్రంలో గంజాయి స్మగ్లింగ్ అనే మాఫియా ఎదిగిపోయింది. దేశంలోని ప్రధాన నగరాలకు ఆంధ్రప్రదేశ్ నుంచే గంజాయి ఎగుమతి అవుతోందన్నది నిర్వివాదాంశం.

‘గంజాయి స్మగ్లింగుని అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. గతంలో కంటే ఎక్కువగా గంజాయిని పట్టుకుంటున్నాం.. కేసులు నమోదు చేస్తున్నాం.. తనిఖీలను పెంచుతున్నాం..’ అని రాష్ట్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం చెబుతోంది.

ఇంకోపక్క గిరిజనులు గంజాయి సాగు చెయ్యకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. వారిలో చైతన్యం పెంచేందుకు ప్రభుత్వం వైపు నుంచి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, స్మగ్లింగ్ ఆగడంలేదు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పోలీస్ ఉన్నతాధికారులు గంజాయి మూలాల గురించి చెబుతూ, ఆంధ్రప్రదేశ్ పేరుని ప్రస్తావిస్తున్నారు.

గంజాయినీ, డ్రగ్స్‌నీ ఒకే గాటన కట్టేసి అటు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, ఇంకోపక్క జనసేన సహా వివిధ పార్టీలు.. అధికార వైసీపీ మీద దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రభుత్వ ప్రతిష్టనీ దెబ్బతీస్తున్నాయి. తద్వారా రాష్ట్రం పరువు బజార్న పడుతోంది.

అయితే, ఇక్కడ విపక్షాలు రాజకీయం చేయడమనేది సర్వసాధారణమైన విషయమే. పొరుగు రాష్ట్రాల్లోని పోలీసు అధికారులే, గంజాయి స్మగ్లింగ్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావిస్తోంటే, విపక్షాల మీద అధికార పార్టీ రాజకీయంగా ఎదురుదాడి చేయడంలో అర్థమే లేదు.

చంద్రబాబుకి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. వరుసగా ట్వీట్లేస్తున్నారు.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, వాటిల్లో ఇతర రాష్ట్రాల అధికారులు చేస్తున్న వ్యాఖ్యల్ని పవన్ ప్రస్తావిస్తున్న దరిమిలా, ప్రభుత్వం రాజకీయ విమర్శల్ని పక్కన పెట్టి, గంజాయి స్మగ్లింగ్‌ని అరికట్టేందుకు మరింత గట్టి చర్యలు తీసుకోవాల్సి వుంది.