జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. గత కొన్ని రోజుల నుంచి ఎక్కువగా ఏ విషయం మీద స్పందించడం లేదు కానీ.. తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీలో జరిగిన ఓ ఘటనపై తీవ్ర భావోద్వేగం చెందారు. ఆడపిల్లలపై వరుసగా జరుగుతున్న దాడులపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లాలోని పలమనేరు దగ్గర ఉన్న రాయలపేటలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం ఏంటి? ఎక్కడికి పోతోంది మన సమాజం? అంటూ ఆయన తీవ్రంగా స్పందించారు.
ఈ ఘటన గురించి తెలియగానే తనకు ఏదోలా అనిపించిందని… ఆ పసిదాని పరిస్థితి ఊహించుకుంటేనే గుండెలు భారంగా మారిపోతున్నాయన్నారు.
ఆడుకోవడానికి పొరుగింటికి వెళ్లిన ఆ చిన్నారిపై 26 ఏళ్ల మృగం కబళించిందని.. పాప పరిస్థితి గురించి ఆసుపత్రి వైద్యులు చెబుతున్న వీడియో చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు.
ఏపీలో ఈ మధ్య కాలంలో వరుసగా ఆడపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలపై పవన్ తీవ్రంగా మండిపడ్డారు. నిర్భయ, దిశ లాంటి పటిష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ ఎందుకు ఇంకా ఆడపిల్లలపై దాడులు జరుగుతున్నాయి. దీనిపై అందరూ నోరు విప్పాలి. లేదంటే ఇంకా ఎందరో అమాయకులైన ఆడపిల్లలు బలవుతూనే ఉంటారు. చిత్తూరు ఘటనకు కారణమైన ఆ మృగాడికి కఠినంగా శిక్ష పడాలి. బాలిక తల్లిదండ్రులకు తగిన పరిహారాన్ని ప్రభుత్వం అందించాలి. ఆ పసిబిడ్డ కోలుకునే వరకు ప్రభుత్వం ఆ పసిబిడ్డకు అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరారు.
ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారామా? – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/4plvJJxuQX
— JanaSena Party (@JanaSenaParty) November 2, 2020