తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలో 16 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగత తెలిసిందే. ఈ దారుణానికి ఒడిగట్టింది బ్లేడ్ బ్యాచ్ ముఠా అని నగరవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు బాలికను బంధించి ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే ఇంతవరకు ఘటనలో ప్రధాన నిందితులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మహిళల రక్షణ కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. మహిళల మీద అరచకాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని అన్నారు. కానీ వాస్తవంలో అలా జరగడంలేదు అనడానికి రాజమహేంద్రవరం ఘటనే నిదర్శనం.
ఈ విషయాన్నే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. అంతేకాదు చట్టం అమలు కావడం లేదని ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. 16 ఏళ్ల బాలికపై కామాంధుల సామూహిక అత్యాచార ఘటన కలచివేసిందన్న పవన్ మృగాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తన కూతురు కనిపించడం లేదని తల్లి పుర్యాధు చేసినా పోలీసులు స్పందించలేదని తెలిసిందన్న పవన్ అసలు మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ చట్టం ఏమైంది, అసెంబ్లీలో ఆమోదం పొందిన చట్టం ఇంకా ఎందుకు అమలు కావడం లేదు. దిశ పేరుతో ఏర్పాటైన పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి. మొదటి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటైన రాజమహేంద్రవరంలోనే ఇలాంటి ఘటన జరిగింది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
అలాగే చట్టం చేయగానే సరిపోదన్న ఆయన దాన్ని సక్రమంగా అమలుచేస్తేనే మహిళలకు రక్షణ కలుగుతుందని చురకలు వేశారు. పవన్ అడిగిన ఈ ప్రశ్నలన్నీ సరైనవే. దిశ చట్టం గురించి అసెంబ్లీలో మాట్లాడే సమయంలో చిన్నారులు, మహిళలపై అత్యాచార ఘటనల్లో వేగవంతమైన విచారణ, కఠిన శిక్షలు విధించేందుకు ఈ చట్టం చేశామని చెబుతూ దీని పర్యవేక్షణకు గాను ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. కేవలం 21 రోజుల్లో విచారణ, శిక్ష అమలు ఈ చట్టంలోని ప్రత్యేకత అన్నారు. మరి ఆ ప్రకారం చట్టం చేసిన నాటి నుండి రాజమహేంద్రవరం ఘటన సహా మహిళలపై అనేక అకృత్యాలు జరిగాయి. వాటన్నిటింటిలో విచారణ ముగిసి నిందితులకు శిక్షలు పడ్డాయేమో చట్టం చేసిన ప్రభుత్వమే చెప్పాలి. పవన్ ఏ సమస్య గురించి మాట్లాడినా వ్యంగ్యంగా ప్రతి విమర్శలు చేసే వైసీపీ ట్విట్టర్ వీరులు కొందరు ఈ విషయంపై ఏం సమాధానం ఇస్తారో చూడాలి.